High Court: రేప్ ఎవరు చేసినా రేపే.. ఒకే కేసుపై విభిన్న తీర్పులు చెల్లుతాయా?
Gujarat High Court: గుజరాత్ హైకోర్టు వైవాహిక అత్యాచారంపై ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. ఓ మహిళ తన భర్త, అత్తగారు, మామగారు వేధింపులకు గురిచేస్తున్నారని భర్త తనను బలవంతం చేస్తుంటే అత్తగారు మామగారు ఆపకుండా వీడియోలు తీసి పోర్న్ సైట్లలో పెట్టేవారని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఈ కేసును పరిశీలించిన గుజరాత్ హైకోర్టు తీర్పు వెల్లడిస్తూ.. రేప్ ఎవరు చేసినా అది రేపే అవుతుందని.. అది వేరే మగాడైనా భర్త అయినా అది నేరం కిందే పరిగణించబడుతుందని తెలిపింది. కోడలిని హింసిస్తుండగా వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేసారే కానీ వారు కనీసం అడ్డుపడలేదని ఇలాంటి వారు సమాజంలో ఉన్నంత వరకు ఆడవాళ్లకు ఆడవాళ్ల నుంచి కూడా రక్షణ ఉండదని న్యాయమూర్తి మండిపడ్డారు.
ఈ కేసు విషయం పక్కన పెడితే.. ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇదే వైవాహిక అత్యాచారంపై తీర్పు వెల్లడించింది. భర్త బలవంతంగా భార్యతో శృంగారం చేస్తే అది అత్యాచారం కింద పరిగణించబడదని.. ఈ అంశంలో ఇంకా సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు తీర్పులు రాలేదు కాబట్టి నిందితుడిని శిక్షించలేం అని తీర్పు వెల్లడించింది.
ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కోర్టు విభిన్న తీర్పులు వెల్లడిస్తోంది. ఇలా ఒకే కేసులో విభిన్న తీర్పులు చెల్లుతాయా అంటే కచ్చితంగా చెల్లుతాయి. ఎందుకంటే అవి రాష్ట్ర పరిధిలోని కోర్టులు కాబట్టి వాటి తీర్పులను వ్యతిరేకించలేం. న్యాయం జరగలేదు అనిపిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు. ఈ వైవాహిక అత్యాచారం నేరం అని ఒకప్పుడు సుప్రీంకోర్టుల్లో వేలల్లో పిటిషన్లు వచ్చాయి. వీటిపై సుప్రీంకోర్టు ఇంకా విచారణలు జరుపుతూనే ఉంది.