Dasara: ప్రీ రిలీజ్​ ఈవెంట్​.. ఎప్పుడు, ఎక్కడంటే?

నేచురల్ స్టార్ నాని హీరోగా పాన్​ ఇండియా రేంజ్​లో తెరకెక్కించిన చిత్రం దసరా. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్​లో జోరు పెంచింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ముహూర్తాన్ని ఫిక్స్​ చేసినట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు అయిదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నదసరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మార్చి 26 ఆదివారం నాడు నిర్వహించనున్నారు. ఇక సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య ఘనంగా జరగనున్న ఈ వేడుకకు అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ వేదిక కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

తెలంగాణలోని సింగరేణి సమీపాన ఉండే వీర్లపల్లి గ్రామం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన ఈ సినిమా గోదావరిఖని ప్రాంత ప్రజల జీవన విధానానికి అద్దం పట్టినట్టు ఉంటుందని ప్రమోషన్స్​లో చెప్పుకొస్తుంది చిత్రబృందం. ఇక, దసరా సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది సెన్సార్ బృందం. సబ్ టైటిల్స్ సహా కొన్ని అసభ్యకరమైన సంభాషణలకు మ్యూట్ పెట్టాలని, మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిపేలా డిస్‌క్లైమర్ పెట్టాలని సూచించింది. అంతేకాకుండా వైలెన్స్ ఉన్న సన్నివేశాలను సీజీతో కవర్ చేయాలని చిత్రబృందానికి సూచించింది. మొత్తంగా 36 కట్స్ చెప్పినట్లు సమాచారం. దసరా సినిమా నిడివి 2 గంటల 39 నిమిషాలు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.