Congress నేత ఇంట్లో రూ.351 కోట్ల నగదు స్వాధీనం.. ఆ డబ్బంతా ఎవరి ఖాతాలోకి వెళ్తుంది?
Congress: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు (dheeraj sahu) ఇంట్లో దాదాపు రూ.351 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లో ఉన్న మొత్తం నల్ల డబ్బును లెక్క పెట్టేందుకు బ్యాంక్ ఉద్యోగులకు దాదాపు నాలుగు రోజులు పట్టింది. దాదాపు 100 మంది ఐటీ అధికారులు కలిసి ఈ నగదును పట్టుకున్నారు. దీంతో పాటు 3కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఝార్ఖండ్, ఒడిశాలలో ధీరజ్ సాహుకి చెందిన డిస్టలరీ కార్మాగారాల్లో ఈ నగదు ఉన్నట్లు సమాచారం రావడంతో ఉన్నట్టుండి ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. బీరువాల నిండా నోట్ల కట్టలు వారే ఆశ్చర్యపోయారు. ఇంత డబ్బు ఒకే సారి స్వాధీనం చేసుకున్న ఘనతను కూడా సాధించారు. అయితే స్వాధీనం చేసుకున్న ఆ డబ్బును ఇప్పుడు ఏం చేస్తారు? అనే ప్రశ్న తలెత్తింది.
ఈ డబ్బును ఓ జాతీయ బ్యాంక్‌కు తరలించారు. ఐటీ శాఖకు చెందిన బ్యాంక్ ఖాతాలలో దీనిని జమ చేస్తారు. ఇప్పటికైతే ఒడిశాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐటీ శాఖకు ఉన్న ఖాతాలో జమ చేసారు. ఈ ఐటీ శాఖకు సపరేట్‌గా ఓ ఖాతాను కేటాయిస్తారు. ఈ ఖాతాను ప్రొవిజన్ డిపాజిట్ అని అంటారు. అక్రమంగా రైడ్ల సమయంలో దొరికిన డబ్బును ఈ ఖాతాలో జమ చేస్తుంటారు. 60 రోజుల్లో ఈ నగదుకు సంబంధించిన ఓ రిపోర్ట్‌ను తయారుచేస్తారు. రిపోర్ట్ తయారయ్యాక ఎవరి నుంచైతే డబ్బును స్వాధీనం చేసుకున్నారో వారికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే.. స్వాధీనం చేసుకున్న డబ్బు అంతా నల్ల ధనమే అనడానికి లేదు. ఐటీ అధికారులకు సమాచారం వచ్చినప్పుడు వారు తనిఖీలు నిర్వహించినప్పుడు ఎంత డబ్బు దొరికితే అంత తీసుకెళ్లిపోతారు.
ఆ తర్వాత ఆ వారికి నిందితుల నుంచి అందిన వివరాల మేరకు ఆ డబ్బంతా తమదే అని నిరూపించుకోగలిగితే పన్నులు విధించి మిగతా డబ్బును వారికి ఇచ్చేస్తారు. ఒకవేళ దొరికిన సొమ్మంతా నల్ల ధనమే అని తెలిస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. నిందితులకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ విచారణ ప్రక్రియ అంతా పూర్తయ్యే సరికి దాదాపు 18 నెలల సమయం పడుతుంది.