KTR రాజీనామా చేయాలి.. పేప‌ర్ లీకేజీపై బండి సంజ‌య్ మండిపాటు

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ను తప్పించి సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయిస్తేనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద పీపర్ల లేకేజీ విషయమై బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు దీక్ష చేపట్టిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్‌ మీడియాతో మాట్లాడారు.

కేటీఆర్‌ రాజీనామా చేయాలి..
ప్రశ్నప్రతాల లీకేజి విషయంలో కేటీఆర్‌ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని బండి సంజయ్‌ సూచించారు. లీకేజీలో ఇద్దరి ప్రమేయమే ఉందని కేటీఆర్‌ చెప్పారని.. మరి ఇద్దరి పాత్ర ఉంటే… సిట్‌ అధికారులు పది మందిని పైగా ఎందుకు విచారిస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. ఎంతో మంది నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి నిద్రాహారాలు మాని పరీక్షలకు సిద్దమవుతుంటే.. పేపర్ లీకేజీ పేరుతో వారి భవిష్యత్తును అంధకారంలోకి కేసీఆర్‌ ప్రభుత్వం నెట్టిందని ఆయన ఆరోపించారు. అయినా నిరుద్యోగులు అధైర్యపడవద్దని, నిరాశ చెందవద్దని.. రానున్నది బీజేపీ ప్రభుత్వమని.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉంటుందని బండి సంజయ్ హామీ ఇచ్చారు. పేపర్ లీక్ కేసులో ప్రభుత్వ మెడలు వంచే దాకా ఉద్యమిస్తామని చెప్పారు. సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులను తానే స్వయంగా స్వీకరించినట్లు పేర్కొన్నారు.