చీర‌లు దొంగిలించిన ఏపీ మ‌హిళ‌లు.. కొరియ‌ర్‌లో ఎందుకు రిటర్న్ చేసిన‌ట్లు?

Chennai: కొంద‌రు మ‌హిళ‌లు క‌స్ట‌మ‌ర్లలాగా న‌టించిన రూ.2ల‌క్ష‌లు విలువైన చీర‌ల‌ను దోచుకెళ్లారు. అయితే దోచుకెళ్లిన ఆ మ‌హిళ‌లు మ‌ళ్లీ చీర‌ల‌ను కొరియ‌ర్‌లో ఎందుకు వెన‌క్కి పంపించారో అర్థంకాక పోలీసులు త‌ల‌బాదుకుంటున్నారు. ఈ ఘ‌ట‌న చెన్నైలో చోటుచేసుకుంది. ఏపీకి చెందిన కొందరు మ‌హిళ‌లు చెన్నైలోని టీ న‌గ‌ర్‌లో ఉన్న చీర‌ల కొట్టుకు వెళ్లారు.

తాము త‌ర‌చూ చీర‌లు కొంటుంటాం అని షాపు సిబ్బందిని న‌మ్మించి కాంచీవ‌రం చీర‌లు చూపించాల‌ని అడిగారు. ఎంత సేపైనా ఏ చీరా కొన‌కుండా ఊరికే అటూ ఇటూ చూస్తుండ‌డంతో ఓన‌ర్‌కు అనుమానం వ‌చ్చింది. అత‌ను సీసీటీవీ ప‌రిశీలించ‌గా.. కొంద‌రు మ‌హిళ‌లు చీర‌ల హ్యాంగ‌ర్ల‌తో స‌హా దొంగిలించ‌డం గ‌మ‌నించాడు. దాంతో వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. అయితే ఆ ఓన‌ర్ ఆ మ‌హిళ‌లు వెళ్లిపోయాక సీసీటీవీ ప‌రిశీలించ‌డంతో అప్ప‌టికే వారు రూ.2 ల‌క్ష‌ల విలువైన చీర‌లు దోచుకెళ్లిపోయారు.

అయితే పోలీసులు ఈ కేసును ఛేదించేలోపు చీర‌లు దోచుకెళ్లిన ఆ మ‌హిళ‌లు వాటిని కొరియ‌ర్‌లో టీ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌కు ఆ చీర‌ల‌ను పంపించార‌ట‌. దాంతో ఆ చీర‌ల‌ను వారు ఎందుకు పంపించారో తెలీక పోలీసులు క‌న్‌ఫ్యూజ్ అయ్యారు. ఆ చీర‌ల‌ను ఎక్క‌డ దొంగిలించారో అక్క‌డికి పంపించేసారు. ఆ మ‌హిళ‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.