KYC వివరాలు అప్డేట్ చేసుకోమని చెప్తున్నారా.. జాగ్రత్త
KYC వివరాలు అప్డేట్ చేసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయడం లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది అంటూ కాల్స్, మెసేజ్‌లు వస్తుంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. కంగారుపడిపోయి వెంటనే లింక్ క్లిక్ చేస్తే ఖాతా బ్లాక్ అవ్వడం కాదు.. అసలు ఖాతాలోనే డబ్బులు లేకుండాపోతాయి. కలకత్తాకు చెందిన ఓ పెద్దాయనకు ఇదే పరిస్థితి ఎదురైంది.
83 ఏళ్ల సిన్హా ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన రిటైర్మెంట్ తర్వాత వచ్చిన దాదాపు రూ.2.5 లక్షల వరకు బ్యాంక్‌లో వేసుకున్నారు. పెన్షన్ వివరాలను నమోదు చేసుకునేందుకు ఆయన తన ఇంటికి దగ్గర్లో ఉన్న బ్యాంక్‌కు వెళ్లారు. కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ సబ్మిట్ చేసాక మరుసటి రోజు ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పెన్షన్ వివరాలు అప్డేట్ చేసేందుకు KYC వివరాలు కావాలని అవతలి వ్యక్తి అడిగారు. పాపం తన బ్యాంక్ నుంచి వచ్చిన ఫోన్ కాలే అనుకుని అన్ని వివరాలు, OTPలు చెప్పారు. ఆ తర్వాత ఒక గంటకే బ్యాంక్‌లో ఉన్న డబ్బు అంతా పోయింది.
డబ్బులు పోవడమే కాదు ఫిక్సడ్ డిపాజిట్లు కూడా బ్లాక్ అయిపోయాయి. సిన్హా లాంటి ఎంతో మంది పెద్దలు ఇలాంటి మోసాలకు బలైపోతున్నారు. వారికి ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. కాబట్టి మీకు ఎవరైనా ఫోన్లు చేసి ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు వంటివి అడిగితే వెంటనే బ్లాక్ చేయడం కానీ రిపోర్ట్ చేయడం కానీ చేయండి. మెసేజ్‌లలో లింక్ క్లిక్ చేయాలని వస్తే కూడా వాటిని పొరపాటును కూడా టచ్ చేయొద్దు. ఈ రోజుల్లో జస్ట్ లింక్ క్లిక్ చేయడం వల్లే లక్షల్లో నష్టోపోయిన వారు ఎందరో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త..!