Revanth Reddy: మస్త్ షేడ్స్ ఉన్నాయ్ అన్నలో..!
Revanth Reddy: ఎవరైనా ఊహించారా.. పార్టీలో చేరిన ఆరేళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తారని.. ఎవరైనా ఊహించారా KCR కాకుండా మరో వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతారని.. అంచనాలన్నీ తలకిందులు చేసి మరీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి. ఎవరైనా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారంటే కచ్చితంగా పాత పార్టీ గురించి అందులో ఉన్న నేతల గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌కు జంప్ అయ్యే సమయంలో TDP తెలంగాణలో హవా కోల్పోతోందని ముందే గ్రహించిన రేవంత్ తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌లోకి వెళ్తున్నానని.. తప్పుగా అనుకోవద్దని ముందే చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకుని అప్పుడు TDPని వీడారు.
అందుకే ఇప్పటికీ ఆయనకు చంద్రబాబు నాయుడుతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. 2007లో స్థానిక ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రేవంత్.. ఆ తర్వాత జిల్లా పరిషత్ సభ్యుడు అయ్యారు. అయితే తనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు రేవంత్ తనతో పాటు పోటీ చేయాలనుకున్నవారి చేత నామినేషన్లు విత్‌డ్రా చేయించారు. రేవంత్‌లో ఒక మంచి స్ట్రాటజిస్ట్ ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం. ఎన్నికల్లోకి రావాలని రేవంత్ నిర్ణయించుకున్న మరుక్షణమే తెలంగాణకు చెందిన దాదాపు అన్ని పార్టీల వారితో సత్సంబంధాలు మెరుగుపరుచుకున్నారు. అలా ఆయన ABVPతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి మెల్లిగా TDP, BRS ఇప్పుడు కాంగ్రెస్‌లో స్థిరపడ్డారు.
అచ్చం సిద్ధారామయ్యలానే..
రేవంత్ రెడ్డి TDP నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆరేళ్లలోనే సీఎం అయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (siddaramaiah) కూడా గతంలో JD(S) నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన తక్కువ సమయంలోనే కర్ణాటక సీఎం బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు రేవంత్‌కి కూడా అదే జరిగింది.
ఫ్యామిలీ మ్యాన్
కౌంటింగ్ సమయంలో ప్రతీ రాజకీయ నాయకుడు టీవీలకు అతుక్కుపోయి కూర్చుని ఉంటారు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని చూసుకుంటూ ఉంటారు. కానీ రేవంత్ మొన్న జరిగిన కౌంటింగ్ సమయంలో అసలు టీవీ ఆన్ కూడా చేయలేదట. తన మనవడితో ఆడుకుంటూ కూర్చున్నారట.
మాంసాహార ప్రియుడు
రేవంత్ రెడ్డికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కాకపోతే మద్యానికి మాత్రం దూరంగా ఉంటారు. రేవంత్‌కి ఫుట్‌బాల్ ఆడటం అంటే ఎంతో ఇష్టం. ఆయన మారడోనా అభిమాని. ఇక సినిమాల్లో ఆయనకు ఇష్టమైన నటుడు సూపర్‌స్టార్ కృష్ణ.