Congress: హైకమాండ్ ఎలా ఒప్పించగలిగింది.. రేవంత్‌కి ముందే మాటిచ్చారా?
Congress: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం పక్కన పెట్టి సీఎం సీటు కోసమే కొట్టుకుంటారు ఒకప్పుడు KTR అన్నారు. అయితే మరీ కొట్టుకునేంత పరిస్థితి లేదు కానీ.. కాంగ్రెస్ హైకమాండ్ అందరినీ కూర్చోపెట్టి నచ్చజెప్పి మొత్తానికి రేవంత్ రెడ్డిని (revanth reddy) సీఎంగా ప్రకటించింది. ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే కచ్చితంగా తననే సీఎంని చేస్తానని మాటిచ్చారట. కాకపోతే మిగతా మంత్రులు ఎక్కడ హర్ట్ అయ్యి పార్టీలు మారిపోతారో అన్న భయంతో చర్చలు జరుపుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు.
సీఎం రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క్ కూడా ఉన్నారు. నిజానికి రేవంత్ కంటే వీరికే కాంగ్రెస్‌తో ఎక్కువ అనుబంధం, అనుభవం ఉంది. రేవంత్ కాంగ్రెస్‌లో చేరిన ఆరేళ్లకే సీఎం పదవి ఎలా కట్టబెడతారు అన్న ప్రశ్నలు హైకమాండ్‌కు ఎదురయ్యాయి. నల్గొండలో తన వల్లే 12 ప్రాంతాల్లో అత్యధిక ఓట్లు పడ్డాయని ఉత్తమ్.. తాను తెలంగాణ మొత్తం చేసిన 1300 కిలోమీటర్ల పాదయాత్ర వల్లే ఖమ్మం మొత్తం తనకు ఓట్లు వేసిందని భట్టి విక్రమార్క చెప్పుకున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడని అలాంటి వ్యక్తికి సీఎం పదవి కట్టబెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
అయితే ఇవేవీ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలకు పట్టలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తం స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారని.. ఓటుకు నోటు కేసులో ఒకప్పుడు అరెస్ట్ అయినప్పటికీ పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆయనకే మొగ్గు చూపుతున్నారని ఉత్తమ్, భట్టికి వివరించారు. అదీకాకుండా ఉత్తమ్, భట్టికి సీఎం పదవి కట్టబెట్టడం పార్టీలో సీనియర్ నేతలైన రేణుక చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకి ఇష్టం లేదు.
సో.. రేవంత్‌ని సీఎంగా ప్రకటిస్తే ఏ గొడవా ఉండదని రాహుల్, ఖర్గే నచ్చజెప్పారు. అదీకాకుండా దాదాపు అందరు కాంగ్రెస్ నేతలు గెలుపునకు అనుగుణంగా తమ నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేసారని ఒక్క రేవంత్ మాత్రమే KCRకు వ్యతిరేకంగా కామారెడ్డిలో పోటీ చేసాడని పేర్కొన్నారు. KCRను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి చేతికి అధికారం ఇస్తేనే బాగుంటుందని అంతా కలిసి రేవంత్‌ను సీఎం చేయాలన్న తీర్మానానికి వచ్చినట్లు తెలుస్తోంది.