Spiritual: ఈ దేవుళ్లు ఇంకా భూమిపైనే ఉన్నారట..!
Spiritual: మన హిందూ పురాణాల్లో ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు, సందేహాలు ఇంకా అలాగే ఉన్నాయి. మనం దేవుళ్లను ఆలయాల్లో .. ఇంట్లో పెట్టుకున్న ఫోటోల్లోనో పూజిస్తుంటాం. మనం పూజించే దేవుళ్లు ఇప్పుడు మనకు కనిపించరు కానీ వారు మన మధ్యే ఉండి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నారు అని బలంగా నమ్ముతాం. అదే మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం. అయితే.. మనం కొలిచే కొందరు దేవుళ్లు ఇప్పటికీ బతికే ఉన్నారని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
హనుమంతుడు
రామ భక్తుడైన హనుమంతుడు.. అశోక వనంలో ఉన్న సీతను కనిపెట్టి రామయ్యకు ఆ విషయాన్ని చేరవేసినందుకు సీతమ్మ ఆయనకు చిరంజీవిగా వర్ధిల్లు అని దీవించిందట. చిరంజీవి అంటే మరణం లేని వాడు అని అర్థం. హనుమంతుడు తన గుండెను చీల్చి రాముడంటే తనకు ఎంత అపారమైన భక్తి, ప్రేమ ఉన్నాయో నిరూపించినందుకు రామయ్య కూడా ఆయన్ను చిరంజీవి అని ఆశీర్వదించారని మరికొన్ని పురాణాలు చెప్తున్నాయి. దేవుళ్లంతా స్వర్గానికి వెళ్లిపోతున్న సమయంలో హనుమంతుడిని మాత్రం భూమిపైనే చిరంజీవిగా ఉండాలని భక్తులను సరైన మార్గంలో నడిపించాలని దీవించారట.
వేద వ్యాసుడు
ఎన్నో పురాణ గాథలను రచించిన వేద వ్యాసుడు కూడా ఇంకా భూమిమీదే ఉన్నారని అంటుంటారు. వశిష్ఠ మహర్షికి వేద వ్యాసుడు ముని మనవడని కూడా చెప్తుంటారు. త్రేతా యుగం అంతమైపోతున్న సమయంలో వేద వ్యాసుడు జన్మించారు. ఆ తర్వాత ద్వాపర యుగమంతటా ఉండి.. కలియుగాన్ని కూడా వీక్షిస్తున్నారని పెద్దలు అంటుంటారు. కలియుగంలో ప్రజలు తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా తప్పుడు పనులు చేయకుండా వేద వ్యాసుడు వారిని ఓ కంట కనిపట్టి సరైన శిక్ష వేస్తున్నారట.
అశ్వథ్థామ
ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వథ్థామ పాత్ర మహాభారతంలో ఎంతో కీలకమన్న విషయం మనకు తెలిసిందే. దుర్యోధనుడిపై అపార ప్రేమ, భక్తి వల్ల ఆయన పాండవులకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. అయితే తన తండ్రి చావుకు కారణమయ్యారని ఆయన పాండవుల పిల్లలను చంపేసినందుకు శ్రీకృష్ణుడి ఆగ్రహానికి గురయ్యాడు అశ్వథ్థామ. ఆ కోపంలో కృష్ణుడు.. అశ్వథ్థామను చావు నుంచి కాపాడుతూ వస్తున్న రత్నాన్ని తొలగించేసాడు. చావు అనేదే లేకుండా బతికున్నంత కాలం చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తూనే ఉండు అని కన్నయ్య శాపం పెట్టాడు. అలా అశ్వథ్థామ భూలోకంలోనే సంచరిస్తున్నాడని చెప్తుంటాడు.
పరశురాముడు
విష్ణుమూర్తి ఆరో అవతారం అయిన పరశురాముడు కూడా చిరంజీవుడేనట. మంచి చేయాల్సింది పోయి అహంకారానికి లోనై ప్రజలను ఇబ్బంది పెడుతున్న క్షత్రియ వంశస్థులను నిర్మూలించాలన్న ధ్యేయంతోనే పరశురాముడు వీరుడిగా మారాడని చెప్తుంటారు. మరో విష్ణుమూర్తి అవతారంలో పుట్టి రాక్షసత్వాన్ని ఎలా నిర్మూలించాలో నేర్పించేందుకు ఇంకా భూమిపైనే ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి.
విభీషణుడు
రావణుడి సోదరుడైన విభీషణుడు .. తన అన్న సీతమ్మను ఎత్తుకొచ్చి తప్పు చేస్తున్నాడని భావించి అది క్షమించరాని నేరం అని తెలుసుకుని రామయ్య చెంతకు చేరాడు. ఆయన నిజాయతీని మెచ్చి రాముడు విభీషణుడికి మరణం అనేదే ఉండదని ఆశీర్వదించారట.