TSPSC పేపర్ లీక్‌ రిమాండ్‌ రిపోర్టులో సంచలనాలు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే సిట్‌ రిమాండ్‌ రిపోర్టను సిద్దం చేసింది. ఇప్పటికి వరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు. తొమ్మిది మంది నిందితులతోపాటు మరో ముగ్గురుని అరెస్ట్ చేశామని.. అందులో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులని.. ఇప్పటివరకు నలుగురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు సిట్ పేర్కొంది. అందులో ప్రవీణ్, రాజశేఖర్, షమీమ్, మరో రాజశేఖర్‌ ఇలా మొత్తం నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు కమిషన్‌ నుంచే ఉన్నారని వారు తెలిపారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మిని ప్రధాన సాక్షిగా సిట్‌ పేర్కొంది. దాదాపు మొత్తం 19 మంది సాక్ష్యులను విచారించినట్టు అధికారులు చెబుతున్నారు.

మేలో పరీక్షలకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు…
కంప్యూటర్‌ హ్యాకింగ్‌, ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో రద్దయిన నాలుగు, వాయిదా వేసిన రెండు పరీక్షల తేదీలను వారం రోజుల్లో ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నది. మే నెలలోనే ఆ పరీక్ష లు నిర్వహించాలని యోచిస్తున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే జూన్‌ 11న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. మిగిలిన పరీక్షల తేదీల ప్రకటన, నిర్వహణ, సీబీటీ విధానం తదితర అంశాల గురించి చర్చించింది. కంప్యూటర్‌ బేస్‌డ్‌ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చైర్మన్‌ అధికారులకు సూచించగా, ఇప్పటికిప్పుడు అంటే సాధ్యం కాకపోవచ్చని, ఆగస్టు వరకు అయితే ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పినట్టు తెలిసింది.