Telangana Elections: కాంగ్రెస్ గెలిస్తే.. సీఎం ఎవ‌రు?

Telangana Elections: ఎన్నిక‌ల పోలింగ్ పూర్తైన నేప‌థ్యంలో వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు కాంగ్రెసే  (congress) ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేస్తుంద‌ని అంటున్నాయి. ఒక‌వేళ కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే తెలంగాణ‌కు ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతారు అనే అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్ అయిన రేవంత్ రెడ్డి (revanth reddy) సీఎం అవుతార‌ని కొంద‌రు.. కాస్త సీనియ‌ర్ అయిన మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క (mallu bhatti vikramarka) అవుతార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

భ‌ట్టినే సీఎం ప‌ద‌వికి అర్హుడా?

మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌కు తెలంగాణ సీఎం అయ్యేందుకు అన్ని అర్హ‌త‌లు ఉన్నాయి. ఆయ‌న మాల కులానికి చెందిన ద‌ళిత నేత‌. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ ప‌ట్టా పొందిన భ‌ట్టి డిప్యూటీ స్పీక‌ర్‌గా, ప్ర‌భుత్వ విప్‌గా, అసెంబ్లీ ఫ్లోర్ లీడ‌ర్‌గా, అన్నింటికంటే ముఖ్య‌మైన ఎలాంటి వివాదాల్లో చిక్కుకోని వ్య‌క్తిగా మంచి ఇమేజ్ ఉంది.

ఒక‌ప్పుడు ఆంధ్ర బ్యాంక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన ఆయ‌న ముందు ఎమ్మెల్సీ అయ్యి ఆ త‌ర్వాత మ‌ధిర నుంచి మూడుసార్లు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచారు. భ‌ట్టి కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ అంశం ఏదన్నా ఉందంటే అది ఆయ‌న చేసిన పాద‌యాత్ర‌. తెలంగాణ మొత్తంలో ఆయ‌న 1300 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేసారు. ఇది ఆయ‌న కెరీర్‌కి ప్ల‌స్ పాయింట్‌గా మారింది.

రేవంత్ రెడ్డి

ఆరేళ్ల క్రితం కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి త‌క్కువ కాలంలోనే స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ఎదిగారు. సీఎం ప‌ద‌వికి ఈయ‌న‌కు క‌ట్ట‌బెట్టే యోచ‌న‌లో కాంగ్రెస్ హైక‌మాండ్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. యువ‌త‌లో రేవంత్‌కి ఉన్న పాపులారిటీనే వేరు. . KCR, KTRల‌ను గ‌ద్దె దింపేందుకు రేవంత్ స‌రైన వ్యక్తి అని అంటుంటారు. కామారెడ్డిలో KCRపై పోటీ చేయ‌డంతో రేవంత్ ఇమేజ్ మ‌రింత పెరిగింది.

కాంగ్రెస్‌కు రెడ్ల ఓట్ల శాతం ఎక్కువ‌. రేవంత్ రెడ్డి కూడా రెడ్డినే కాబ‌ట్టి సీఎం ప‌ద‌వికి ఆయ‌నే క‌రెక్ట్ అనే టాక్ వినిపిస్తోంది. సీఎం అయ్యేంత అనుభ‌వం లేక‌పోయినా ఒక‌వేళ హైక‌మాండ్ ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెడితే స‌వ్యంగా ప‌రిపాలించే సామ‌ర్ధ్యం ఉంద‌ని ఆయ‌న అనుచ‌రులు భావిస్తున్నారు.

ప్ర‌స్తుతానికైతే సీఎం ప‌ద‌వి విష‌యంలో వీరిద్ద‌రి పేర్లే విన‌ప‌డుతున్నాయి కానీ లైన్‌లో చాలా మంది సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లు ఉన్నారు. రేవంత్‌కి కానీ భ‌ట్టికి కానీ ప‌ద‌వి ఇస్తే తిర‌గ‌బ‌డి ప్ర‌తిప‌క్ష పార్టీల్లో చేరిపోయే అవ‌కాశం లేక‌పోలేదు. మ‌రి హైక‌మాండ్ ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రిస్తుందో వేచి చూడాలి.