Telangana Elections: BRS ఓడిపోతే.. ఈ నాలుగే కార‌ణం..!

Telangana Elections: తెలంగాణ‌లో పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ (exit polls) ఫ‌లితాలు కూడా వ‌చ్చేసాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెసే (congress) తెలంగాణ‌లో ప్ర‌భుత్వం ఏర్పాటుచేస్తుంద‌ని చెప్తున్నాయి. మ‌రోపక్క మంత్రి KTR ఆ ఎగ్జిట్ పోల్స్ న‌మ్మ‌కండి అవ‌న్నీ అబ‌ద్ధాలే అని అంటున్నారు. గ‌తంలో కూడా BRS పార్టీ ఓడిపోతుంద‌ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయ‌ని కానీ తామే అధికారంలోకి వ‌చ్చామ‌ని గుర్తుచేసారు. ఈసారి తెలంగాణ‌లో 70కి పైగా సీట్ల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేస్తామ‌ని ధీమాగా చెప్పారు. అయితే.. ఎగ్జిట్ పోల్స్ నిజ‌మై BRS పార్టీ ఓడిపోతే అందుకు ఈ నాలుగు అంశాలే కార‌ణం అవుతాయి. అవేంటంటే..

క‌ర్ణాట‌క ఎఫెక్ట్

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో BJPని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ విజ‌య‌భేరి మోగించింది. అక్క‌డ అమ‌లు చేస్తున్న ఆరు హామీలనే తెలంగాణ మానిఫెస్టోలోనూ ప్ర‌క‌టించారు. BRS పార్టీ ఇస్తున్న‌దాని కంటే ఎక్కువే ఇస్తామ‌ని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ పాయింట్ BRSని ఓట‌మి వైపు న‌డిపించే అవ‌కాశం ఉంది.

BRS ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌త‌

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత నుంచి రెండు సార్లు BRS పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. తెలంగాణ‌ను అభివృద్ధి చేసాం అని చెప్పుకుంటున్నారే త‌ప్ప ఆ అభివృద్ధి రాజధాని హైద‌రాబాద్‌లో త‌ప్ప ఎక్క‌డా క‌నిపించ‌డంలేద‌ని అంటున్నారు. అదీకాకుండా TSPSC ప‌రీక్షా పేప‌ర్లు లీక్ అవ్వ‌డం.. ప‌రీక్ష‌లు రాసాక ఫ‌లితాలు వెల్ల‌డి కాక‌పోవ‌డంతో యువ‌త ప్ర‌భుత్వ కొలువులు లేక నోటిఫికేష‌న్లు రాక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ అంశాలు BRS పార్టీకి వ్య‌తిరేకంగా నిలిచాయి.

చంద్ర‌బాబు అరెస్ట్‌పై KTR స్పంద‌న‌

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ అయిన‌ప్పుడు KTR చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ కూడా ప‌డింది. చంద్ర‌బాబు అరెస్ట్‌కు నిర‌సన‌గా ఐటీ ఉద్యోగులు హైద‌రాబాద్‌లో ఎక్క‌డా కూడా ధ‌ర్నాలు నిర‌స‌న‌లు చేయ‌డానికి వీల్లేద‌ని KTR అన‌డంతో ఇక్క‌డ ఉన్న ఆంధ్ర వాసుల్లో అభ‌ద్ర‌తా భావాన్ని నింపింది. దాంతో ఈ పాయింట్‌ను కాంగ్రెస్ త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ఉండొచ్చు.

అద్భుత‌మైన ప్ర‌చారం

గ‌తంతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ ప్ర‌చారానికి పెద్ద పీట వేసిన‌ట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు స‌రైన పాయింట్లు ప‌ట్టుకుని మాట్లాడ‌టం ప్ర‌జ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపించిన‌ట్లు క‌నిపిస్తోంది. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కే ఈసారి ఓటు వెయ్యండి అని హోరా హోరీగా ప్ర‌చారం జ‌రిగింది.

ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు ఫేకా లేక నిజ‌మా అని తెలీడానికి ఇంకా ఒక్కరోజే స‌మ‌యం ఉంది. ఆదివారంతో తెలంగాణ బాద్‌షా ఎవ‌రో తెలిసిపోతుంది.