కాఫీతో ముఖానికి కళ!
అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అందుకు రకరకాల క్రీములు, పౌడర్లు, ప్యాక్‌లు వాడుతుంటారు. కొందరు బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతూ రకరకాల ఫేషియల్స్ చేయించుకుని అందంగా మెరిసిపోయేందుకు ప్రయత్నిస్తారు. అయితే బయటికి వెళ్లే పనిలేకుండా, బ్యూటీపార్లర్ల పేరున డబ్బులు వృథా చేసుకునే అవసరం లేకుండా ఇంట్లోనే చక్కగా మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు. ఇంట్లో ఉండే కాఫీ పౌడర్, పాలు, పసుపు, శనగపిండి వంటివాటితో ఫేస్‌ప్యాక్‌లు వేసుకుంటే చక్కని మెరుపు సొంతమవుతుందంటున్నారు. కాఫీ పొడి చర్మం నిగారింపుకి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..
* కొందరికి కళ్ళు ఉబ్బి ఉంటాయి. అవి చూడ్డానికి అంతగా బాగోవు. ఈ సమస్యను పోగొట్టేందుకు కాఫీ పౌడర్ బాగా పనిచేస్తుంది. కాఫీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ సమస్యని తగ్గిస్తాయి. ఒక స్పూన్ కాఫీ పౌడర్ని గోరువెచ్చని నీటిలో కలిపి కాటన్ బాల్స్‌తో కళ్లకింద తరచుగా అద్దితే మంచి ఫలితం ఉంటుంది.
* కంటి కింద నల్లని వలయాలు కూడా చాలా మందిని ఇబ్బంది పెడతాయి. అలాంటివారు కూడా కాఫీ పౌడర్‌తో సమస్యని దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం అర టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ తేనెతో కలిపి పేస్ట్‌లా చేసి నల్లని వలయాలపై అప్లై చేయాలి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి నల్లని వలయాలు తగ్గుతాయి.
* యుక్తవయస్సు నుంచి మధ్యవయస్సు వరకు చాలామంది మహిళల్లో కనిపించే సాధారణ సమస్య మొటిమలు. కొంతమందికి ఏం చేసినా మొటిమల సమస్య తగ్గదు. అలాంటి వారు కూడా కాఫీ పౌడర్‌తో సమస్యని దూరం చేసుకోవచ్చు. కాఫీలోని యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ నేచురల్ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఇందుకోసం కాఫీ పొడిని తీసుకుని కొద్దిగా నీరు కలిపి మీ ముఖంపై స్క్రబ్‌లా రుద్దాలి. ఇలా రుద్దడం వల్ల ముఖంమీది మృతకణాలు పోయి మొటిమలు తగ్గడమే కాక మంచి నిగారింపు వస్తుంది.
* ఒక టేబుల్ స్పూన్ శనగపిండి 3 టీ స్పూన్ల కాఫీ పొడి కలిపి ఫ్యాక్ వేసుకున్నా మొటిమల సమస్య తగ్గుతుంది. అదే విధంగా 3 టీస్పూన్ల తేనె, 2 టీ స్పూన్ల అలోవేరా జెల్, 2, 3 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి ప్యాక్‌లా చేసి రాయండి. 15 నిమిషాల తర్వాత నీటితో కడిగితే మొటిమల సమస్య తగ్గి ముఖం నునుపుదనాన్ని సంతరించుకుంటుంది.
* ఎండ వల్ల కమిలిన చర్మాన్ని మెరిపించేందుకు కూడా కాఫీ బాగా పనిచేస్తుంది. కాఫీలోని పాలీఫెనాల్స్ యూవీ కిరణాల నుండి రక్షిస్తుంది. ఫైన్ లైన్స్‌ని దూరం చేస్తుంది. ఇందుకోసం 1 టేబుల్ స్పూన్ కాఫీతో పాటు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం బాగా కలపండి. దీనిని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత చల్లని నీటిపై కడిగేయాలి.
* కాఫీ పొడిని తరచుగా ప్యాక్‌లలో కలిపి వేసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. రెండు స్పూన్ల కాఫీ పొడిలో నాలుగు స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి ముఖం, మెడ చుట్టూ ప్యాక్‌లా వేసుకోవాలి. ఈ రెండింటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
* అరటేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, అర టేబుల్ స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఈ ప్యాక్‌ని పెదాలపై కూడా రుద్దవచ్చు. దీని వల్ల కూడా నల్లని పెదాలు ఎర్రగా అవుతాయి. వీటిని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు, గీతలు తగ్గి ముఖం కళగా మారుతుంది.