Poll Code: ఉల్లంఘిస్తే పోటీ చేయలేరా.. చట్టం ఏం చెప్తోంది?
Poll Code: ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం (election commission of india) పోల్ కోడ్ అనే ఓ నియమాన్ని విధిస్తుంది. అంటే ఎన్నికల తేదీ ప్రకటించేసిన తర్వాత పోటీ చేస్తున్న ఏ పార్టీలు కూడా కొత్త పథకాలను ప్రకటించకూడదు. ఎవ్వరికీ డబ్బులు పంచడం.. కానుకలు ఇవ్వడం వంటివి చేయకూడదు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు KTR, హరీష్ రావులు (harish rao) పోల్ కోడ్ నియమాలను ఉల్లంఘంచారని పేర్కొంటూ ఎన్నికల కమిషన్ వారికి నోటీసులు జారీ చేసింది.
రైతు బంధు డబ్బులు వేస్తామని హరీష్ రావు ప్రకటించడంతో ముందు దీనికి ఒప్పుకున్న ఎన్నికల సంఘం ఆ తర్వాత కాంగ్రెస్ ఫిర్యాదుతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మరోపక్క KTR ఓ విద్యా సంస్థకు వెళ్లి అక్కడ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారని.. సోషల్ మీడియాలో వివిధ ఛానెళ్ల ద్వారా పొలిటికల్ స్పీచ్‌లు చేస్తున్నారని ఆయనకు నోటీసులు అందాయి. ఇవి పోల్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయి. కేవలం పబ్లిక్ మీటింగ్‌లు మాత్రమే ఏర్పాటుచేసుకోవాలి కానీ మీడియా ఛానెల్స్, కాలేజ్‌లు వంటి చోటికి వెళ్లి మరీ ప్రచారాలు చేయకూడదు అని పోల్ కోడ్ రూల్‌లో ఉంది. (poll code)
నియమాన్ని ఉల్లంఘిస్తే పోటీ చేయలేరా?
అలాగని ఏమీ లేదు. ఏ విషయంలో అభ్యర్ధి పోల్ కోడ్‌ను ఉల్లంఘించారో దాని తీవ్రతను బట్టి ఎన్నికల కమిషన్ నోటీసులు ఇస్తుంది. ఆ నోటీసులకు సదరు అభ్యర్ధి వెంటనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ పలుమార్లు హెచ్చరించిన తర్వాత కూడా అభ్యర్ధి నిబంధనలు ఉల్లంఘిస్తుంటే వారి నామినేషన్ రద్దు అవుతుంది. అప్పుడు ఆ అభ్యర్ధి పోటీ చేయలేరు.
పోల్ కోడ్ ఉల్లంఘనల వల్ల జైలుకి వెళ్లే అవకాశం ఉందా?
కచ్చితంగా ఉంటుంది. కాకపోతే అరుదుగా ఇలాంటివి జరుగుతుంటాయి. పోటీలో లేకపోయినా ఫర్వాలేదు కానీ ఏ అభ్యర్ధి కూడా నామినేషన్ రద్దు అయ్యే పనులు కానీ జైలుకి వెళ్లేంతగా నిబంధనలను ఉల్లంఘించడం కానీ చేయాలనుకోరు.