Telangana Elections: AI ద్వారా స్వతంత్ర అభ్యర్ధి ప్రచారం.. ఎవరితను?
Telangana Elections: ఎన్నికల ప్రచారం అంటే నేతలు కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతారు. తమ పార్టీ గుర్తుకే ఓటు వేయాలని కొందరు డబ్బులు కూడా ఇస్తుంటారు. మరికొందరు ఏవైనా కానుకలు ఇచ్చి ఓటర్లను మచ్చిక చేసుకుంటారు. అయితే ఓ అభ్యర్ధి మాత్రం వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. అతను ఎవరో.. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకుందాం.
పై ఫోటోలో కనిపిస్తున్న అందమైన ఫ్యామిలీని చూసారా. ఆ యువకుడి పేరు సిద్ధార్థ్ చక్రవర్తి (siddharth chakravarthy). హైదరాబాద్‌కి చెందినవాడే. అమెరికాలో ఓ AI కంపెనీని పెట్టి అక్కడే స్థిరపడ్డాడు. సిద్దార్థ్ స్వతంత్ర అభ్యర్ధిగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్నాడు. అమెరికాలో ఉంటే ఇక్కడ ఎలా పోటీ చేస్తాడు? ఎలా ఓటర్లను ఆకట్టుకుంటాడు? అనేగా మీ సందేహం. ఇతను అమెరికాలో ఉంటూనే రోజూ ప్రచారం చేస్తున్నాడు. ఎలాగో తెలుసా? AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా.
ఇతని కంపెనీ ద్వారానే ఓటర్లతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునే టెక్నాలజీని రూపొందించాడు. ఇప్పుడున్న రాజకీయ నేతుల ఇంకా ఇంటింటికీ తిరిగి మూస పద్ధతిలోనే ఓట్లు అడుగుతున్నారని.. ఇప్పుడు టెక్నాలజీ చీప్‌గా లభిస్తుండగా ఎవ్వరూ దానిని వాడటం లేదని సిద్ధార్థ్ అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ ఎన్నో రంగాల్లో దూసుకెళ్తున్నప్పుడు రాజకీయాల్లో ఎందుకు వినియోగించుకోకూడదు అని ప్రశ్నిస్తున్నాడు.
ఇతను ఆలోచనా విధానం బాగానే ఉంది కానీ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతుంటేనే గెలవలేకపోతున్న అభ్యర్ధులు ఉన్నారు. అలాంటిది టెక్నాలజీని ఉపయోగించి నేరుగా కాకుండా వీడియో కాల్స్ ద్వారా ప్రచారం చేసే వారికి ఎవరు నమ్మి ఓటేస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదీకాకుండా పేద ఓటర్లకు ఈ టెక్నాలజీ అంటే ఏంటో తెలీదు. ఓ మనిషి ఎదురుగా నిలబడి మాట్లాడితే వచ్చే ఫీల్ వీడియో కాల్స్‌లో మాట్లాడితే రాదుగా..!