కాంతార 2​.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రిషబ్​ శెట్టి!

కథ, కథనం బాగుంటే చాలు ఏ భాషా చిత్రమైనా సూపర్‌‌హిట్ అవుతుందని నిరూపించిన సినిమా కాంతార. కన్నడలో చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పలు భాషల్లో విడుదలై భారీ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈమధ్యనే అంతర్జాతీయ వేదికపై కూడా ప్రదర్శించబడి అరుదైన గౌరవం అందుకుంది. అంతేకాదు ఈ సినిమాను ఇంగ్లీష్​తోపాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ డబ్బింగ్​ చేస్తున్నట్టు ప్రకటించింది నిర్మాణ సంస్థ హోంబళే. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో శుభవార్త చెప్పారు హీరో, దర్శకుడు రిషబ్​ శెట్టి. ఆదివాసీ సంప్రదాయం, సంస్కృతి, జీవన విధానం ఆధారంగా తెరకెక్కిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కించనున్నట్టు వెల్లడించారు. కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’సినిమా తెలుగులోనూ భారీ కలెక్షన్లు సాధించింది. అంతేకాదు ఈ సినిమా రెండో పార్ట్‌ కూడా తెరకెక్కించే ఆలోచన ఉందని వెల్లడించారు నిర్మాతలు. ఈ సినిమానూ కేజీఎఫ్ వంటి సూపర్‌‌ డూపర్ హిట్ సినిమాను నిర్మించిన హోంబలే సంస్థ రూపొందించింది.

కాంతార రెండో భాగం ఉంటుందని చిత్ర నిర్మాత, హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ ఇప్పటికే ధృవీకరించారు. ఈ విషయాన్ని కాంతార సినిమాలో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి కూడా స్పష్టం చేశారు. దీని గురించి ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా,ఉగాది సందర్భంగా  కాంతార సినిమా రెండో భాగం గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది హోంబలే సంస్థ. సోషల్ మీడియా వేదికగా గుడ్‌న్యూస్ షేర్ చేసింది. కాంతార మరో భాగాన్ని తెరకెక్కించే సన్నాహాలు మొదలయ్యాయని, ఉగాది సందర్భంగా కాంతార రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్టు తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను దర్శకుడు రిషబ్ శెట్టి తెలిపారు. ‘కాంతార’ తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలైనట్లు ఇప్పటికే వెల్లడించారు. అయితే, ఈ సినిమా సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అన్నారు. తొలి భాగం ఎక్కడైతే ప్రారంభమైందో, దానికి ముందు జరిగిన సంఘటనలు రెండో భాగంలో చూపించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ‘కాంతార’ ప్రీక్వెల్ 2024లో విడుదలవుతుందని తెలిపారు రిషబ్‌ శెట్టి.

గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి ‘కాంతార’ ప్రీక్వెల్‌లో చూపిస్తామని నిర్మాత విజయ్ కిరంగదూర్ అన్నారు. భూమిని రక్షించడానికి గ్రామస్తులతో పాటు రాజు ఏం చేశాడనేది తెర మీద చూపించనున్నట్లు చెప్పారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం వర్షాధార వాతావరణం అవసరమన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ముందుగా కన్నడలో విడుదలైన ‘కాంతార’ సినిమాను తరువాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీలోకి మేకర్స్ డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. ఐఎమ్‌డీబీలో అత్యధిక రేటింగ్‌ సాధించిన సినిమాగా కూడా ‘కాంతార’ నిలిచింది. అనూహ్య విజయం సాధించిన ‘కాంతార’ ప్రీక్వెల్ ఎంతటి ఘన విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి. కాంతార సినిమాను తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేశారు. చాలా తక్కువ బడ్జెట్‌కు కొనుగోలు చేసిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి.. మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అంతేకాదు, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌లో కూడా రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.