Rishi Sunak: చస్తే చావనీ.. కోవిడ్ సమయంలో ఆర్థిక మంత్రిగా సునాక్ సలహా
Rishi Sunak: కోవిడ్ సమయంలో బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న రిషి సునాక్… అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్‌తో (boris johnson) సమావేశం అయినప్పుడు షాకింగ్ వ్యాఖ్యలు చేసారట. కోవిడ్ వల్ల ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే రిషి సునాక్ చస్తే చావనీ అని బోరిస్‌తో అన్నారట. ఈ విషయాన్ని అప్పటి ప్రభుత్వ చీఫ్ సైంటిఫిక్ సలహాదారు ప్యాట్రిక్ వాలెన్స్ తన డైరీలో రాసుకున్నారు. దాంతో అసలు బ్రిటన్ ప్రభుత్వం కోవిడ్ వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంది అనే అంశంపై విచారణ జరుగుతోంది. ఈ విచారణ సమయంలో ప్యాట్రిక్ రిషి సునాక్ అన్న మాటలను బయటపెట్టారు. దాంతో రిషి సునాక్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది.
కోవిడ్ వచ్చినప్పుడు అసలు ఎలా ఎదుర్కోవాలో బ్రిటన్‌కు అర్థంకాలేదు. పైగా అదే సమయంలో లోకల్ రెస్టారెంట్లు, హోటల్స్ తీవ్రంగా నష్టపోయాయి. వారికి సాయం చేసేందుకు ప్రభుత్వం ఈట్ అవుట్ టు హెల్ప్ అవుట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రజలు రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లి తినాలని పిలుపునిచ్చింది. దీని ద్వారా వారి వ్యాపారాలు కూడా బాగుపడతాయన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు జరుగుతున్న విచారణ 2026 వేసవి కాలం వరకు జరుగుతూనే ఉంటుందని.. ఆ తర్వాత విచారణలో ఏం తేలిందో వెల్లడిస్తామని ఎంక్వైరీ కమిటీ బృందం పేర్కొంది.