పాన్-ఆధార్ లింక్ చేసారా? లేదంటే జరిగే నష్టాలు ఇవే

పాన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానానికి గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. మార్చి 31లోగా వెయ్యి రూపాయల ఫైన్‌ చెల్లించి పాన్‌- ఆధార్‌ లింక్‌ చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలియజేసింది. అయితే … ఈ విషయాన్ని చాలా మంది లైట్‌ తీసుకుంటున్నారు. తర్వాత చేయించుకుందాంలే.. ఇప్పుడే ఎందుకు… పైగా వెయ్యి ఫైన్‌ చెల్లించాలా అని భావిస్తున్నవారూ ఉన్నారు. అయితే వీరందరికీ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ నెల 31లో పాన్‌తో ఆధార్‌ అనుసంధానం కాకపోతే.. ఇక ఎప్పటికీ వారి పాన్‌కార్డు పనిచేయదని తేల్చి చెప్పింది. దీంతోపాటు డీమాట్‌ ఎకౌంట్లు, మ్యూట్యూవల్‌ ఫండ్‌ ఖాతాలు తెరవడానికి అవకాశం ఉండదని.. బ్యాంకు లావాదేవీలు సాధ్యపడవని చెబుతోంది. అనుసంధానం చేయని పాన్ కార్డును ఎక్కడైనా డాక్యుమెంట్‌గా ఉపయోగిస్తే భారీ జరిమానాలు విధించవచ్చు అని సమాచారం. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 272బి ప్రకారం, రూ. 10,000 వరకు జరిమానా విధించే అవకాశముంది అని పలువురు నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఒకవేళ గడువు పొడిగించినా.. ఈసారి ఫైన్‌ మరింత పెంచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి ఇంకెందుకు నిర్లక్ష్యం.. పాన్‌తో ఆధార్‌ అనుసంధానం చేసేయ్యండి.