ఉద్యోగాలు కావాలంటే.. KCR, KTRల‌కు మీరు ఉద్యోగాలు ఇవ్వ‌కూడ‌దు

Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ ఖానాపూర్‌లో ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈరోజు తెలంగాణ యువ‌త ఉద్యోగాలు లేక అల్లాడుతున్నార‌ని యువ‌త‌కు ఉద్యోగాలు కావాలంటే KCR, KTRల‌కు ఓట్లు వేసి వారికి ఉద్యోగాలు క‌ల్పించ‌కూడ‌ద‌ని అన్నారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు గ‌మ‌నించి సోనియా గాంధీ ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చార‌ని కానీ ప‌దేళ్లుగా KCR తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను క‌ల‌ల‌ను వ‌మ్ముచేసారని అన్నారు. KCR పాల‌న‌లో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు ఒక్క‌టి కూడా నెర‌వేర‌లేద‌ని నిరుద్యోగుల‌కు ప‌దేళ్లుగా ఉద్యోగ అవకాశాలు లేవ‌ని పేర్కొన్నారు.

తెలంగాణ‌లో 40 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు ఉన్నార‌ని వారిని నిరుద్యోగ భృతి ఇస్తాన‌ని KCR మోసం చేసార‌ని ఆరోపించారు. ప‌రీక్ష‌లు రాసే స‌మ‌యానికి పేప‌ర్ లీకులు అవుతాయ‌ని పోనీ రాసిన త‌ర్వాత ఫ‌లితాలు వ‌స్తాయా ఉద్యోగాలు వ‌స్తాయా అన్న సందేహాలు కూడా ఉంటాయ‌ని విమ‌ర్శించారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ పేరుతో KCR ఎంద‌రో భూముల‌ను లాక్కున్నార‌ని.. కానీ ప్ర‌జ‌ల‌కు మాత్రం నెల నెలా డ‌బ్బులు వేస్తున్నామ‌ని తియ్య‌టి మాట‌లు చెప్తున్నారని అన్నారు.