Uttarakhand Tunnel: తప్పించుకునే మార్గం గీసారు కానీ నిర్మించలేదు.. ఇదేం దారుణం..!
Uttarakhand Tunnel: ఇది మానవతప్పిదమే కదా..! ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా (silkyara) సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల జీవితాలు చావు బతుకుల మధ్య ఉన్నాయి. 160 గంటలుగా ఇదే సొరంగంలో ఇరుక్కుని ఉన్నారు. వారిని క్షేమంగా బయటికి తీసుకురావాలని ప్రభుత్వం థాయ్‌ల్యాండ్ నుంచి యంత్రాంగాన్ని పిలిపించి సహాయక చర్యలు చేపడుతోంది. వారంతా సొరంగంలోకి వెళ్లి పనులు చేస్తున్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వారు లోపలే ఇరుక్కున్నారు.
కార్మికులు పనిచేసే ఏ సొరంగానికైనా తప్పించుకునే మార్గం అనేది ఒకటి తప్పకుండా నిర్మిస్తారు. దీనిని ఎస్కేప్ రూట్ అంటారు. అయితే ఉత్తరాఖండ్‌లోని ఈ సిల్క్యారా సొరంగానికి మాత్రం ఎస్కేప్ రూల్ ప్లాన్ చేసారు కానీ నిర్మించకపోవడం గమనార్హం. మరి ఇది మానవ తప్పిదం కాకపోతే మరేంటి?
ఒక సొరంగం పొడవు 3 కిలోమీటర్ల కంటే ఎక్కవ ఉంటే ఎస్కేప్ రూట్‌ని నిర్మిస్తారు. ఇప్పుడు ఈ సిల్క్యారా సొరంగం కూడా మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంది. ప్లాన్‌లో గీసిన ఎస్కేప్ రూట్‌ని ఎందుకు నిర్మించలేదు అనే సందేహాలు మొదలవుతున్నాయి. ఇప్పటివరకు కార్మికులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మూడు చర్యలు చేపట్టారు. కానీ ఈ మూడు చర్యలు విఫలమయ్యాయి. దాంతో ఇప్పుడు ప్లాన్ డి ప్రకారం మధ్యప్రదేశ్ నుంచి డ్రిల్లింగ్ మెషీన్ తీసుకొచ్చి దానితో డ్రిల్ చేసి వారిని పై నుంచి లాగేందుకు యత్నిస్తున్నారు. (uttarakhand tunnel)
ఇప్పటికే వారికి ఆహారం, నీళ్లు పైప్ ద్వారా అందిస్తున్నారు. పైప్ ద్వారానే వారితో మాట్లాడేందుకు యత్నిస్తున్నారు. అయితే నిన్నటి వరకు బాగానే మాట్లాడిన వారు నీరసించి పోయి ఈరోజు సరిగ్గా మాట్లాడలేకపోయారు. దాంతో కుటుంబీకులు, యంత్రాంగం భయాందోళనలకు గురవుతోంది.