ఇక‌ గర్భ నిరోధానికి పిల్స్‌తో పనిలేదు!

దేశంలోని అనేక మంది యువ జంటలు ఎక్కువ మంది తమకు సంతానం ఇప్పుడే వద్దు అని భావిస్తుంటారు. మరి కొందరు బిడ్డకు బిడ్డకు వ్యత్యాసం కావాలని కోరుకుంటుంటారు. వీరందరూ సాధారణంగా ట్యాబ్‌లెట్స్‌, ఇంజెక్షన్లు, కాపర్-టి, కండోమ్స్‌ వంటి సాధనాలను వినియోగిస్తుంటారు. కానీ వీటి స్థానంలో కొత్త పద్ధతిని వినియోగించి సత్ఫలితాలు పొందవచ్చని కేంద్రం చెబుతోంది. ఈ కొత్త విధానం ఏంటంటే… సుమారు 3-4 సెంటీమీటర్ల పొడవు, 2-4 మిల్లీమీటర్ల పొడవు ఉన్న సూదిలాంటి వస్తువుని మహిళల మోచేతి చర్మం కింద పైపొరలో అమరుస్తారు. దీని ద్వారా గర్భాన్ని నిరోధించే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నిజానికీ ఈ సాధనం హార్మోన్‌తోనే తయారుచేసిందే. దీని వల్ల భార్యాభర్తల సఖ్యతకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధానాన్ని ‘సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్’గా పిలుస్తున్నారు. దీన్ని తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందుబాటులో..
ఈ కొత్త సాధనాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. ముందుగా స్టాఫ్ నర్సులు కూడా దీనిని సులభంగా అమర్చేలా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సాధనం వల్ల ఎలాంటి అసౌకర్యమూ, అనారోగ్య సమస్యలు తలెత్తవని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సులభంగా దీనిని తొలగించుకోవచ్చు అని అంటున్నారు. తొలగించిన 48 గంటల తర్వాత గర్భం వచ్చేందుకు అవకాశం కూడా ఉంటుందట. అయితే దీన్ని కుడిచేతి వాటం ఉన్న వారికి ఎడమవైపు, ఎడమచేతి వాటం ఉన్న వారికి కుడివైపున దీనిని అమరుస్తారు. కెన్యాలో ఈ విధానం దాదాపు రెండున్నర దశాబ్దాలుగా అమల్లో ఉంది. మరి ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని ప్రజలకు కూడా భావిస్తున్నారు. వీలైనంత త్వరగా అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నారు.