పురుషాంగ రూపంలో దర్శనమిచ్చే శివయ్య..!
Lord Shiva: మన భారతదేశంలో వేలాది శివాలయాలు ఉన్నాయి. దేని ప్రత్యేకత దానిదే. కానీ మన తెలుగు ప్రాంతం అయిన చిత్తూరు జిల్లాలో ఉన్న గుడిమల్లం శివయ్య కాస్త ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ శివయ్య విగ్రహం అతిపురాతనమైనది. ఇంకా చెప్పాలంటే ఇదే శివుడి రెండో రూప దర్శనం అని అంటుంటారు. ఈ ఆలయం ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలంలో ఉంది ఈ ఆలయం. ఇక్కడి స్వామివారిని పరశు రామేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారు గర్భగుడిలో పురుషాంగం ఆకారంలో వెలసి ఉంటారు. ఇక్కడి విగ్రహం 7వ శతాబ్ద కాలం నాటికి చెందిందని స్థానికులు చెప్తుంటారు. ఇలాంటి ఆకారంలో ఉండే శివుడి విగ్రహం దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదని సమాచారం. గోపీనాథ్ రావు అనే పురావస్తు శాఖలో పనిచేసే అధికారి ద్వారా ఇలాంటి లింగం ఒకటి ఉందని బయటకు వచ్చింది. అప్పుడు ఆయన ఈ లింగం గురించి ప్రచురించి నలుగురికీ తెలిసేలా చేసారు.
ఈ లింగం కింది భాగం పూర్తిగా భూభాగంలోకే ఉంటుంది. లింగం సైజు 5 అడుగులు ఉన్నట్లు గోపీనాథ్ రావు ప్రచురించారు. ఈ ఆలయంలోని శివుడి విగ్రహం వేటగాడి మాదిరిగా కనిపిస్తుంది. ఆయన భుజంపై ఒక కొడవలి చేతిలో దుప్పి కూడా కనిపిస్తాయి. స్వర్ణ ముఖి నదీ తీరాన ఉన్న ఈ ఆలయానికి ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది.
రేణుక తనను మోసం చేస్తోందని భావించిన ఆమె భర్త జమదగ్ని తమ కుమారుడు అయిన పరశురాముడిని పిలిచి రేణుక తల నరకాలని ఆదేశిస్తాడు. తండ్రి చెప్పాడు కదా అని పరశురాముడు కన్న తల్లి అయిన రేణుక తల నరికేస్తాడు. తన మాటకు విలువిచ్చినందుకు ఏం కావాల కోరుకోమని జమదగ్ని పరశురాముడికి వరం ఇస్తాడు. అప్పుడు పరశురాముడు తన తల్లి తనకు ప్రాణాలతో కావాలని కోరుకుంటాడు. జగదగ్ని అందుకు ఒప్పుకుంటాడు. అయితే తన తల్లి తిరిగి బతికినప్పటికీ తన చేతులతో ఆమె తల నరకినందుకు కుంగిపోతుంటాడు పరశురాముడు.
తాను చేసిన పాపాన్ని ఎలా కడిగేసుకోవాలా అని ఆలోచిస్తున్న పరశురాముడికి కొందరు రుషిలు కనిపించి గుడిమల్లంలోని శివయ్యకు పూజిస్తే పాపం పోతుందని చెప్తారు. అలా రోజూ తనకు కొలనులో కనిపించే ఒక పువ్వును తెచ్చి శివలింగాన్ని పూజిస్తుంటాడు పరశురాముడు. అయితే ఆ పువ్వును జాగ్రత్తగా చూసుకోవడానికి బ్రహ్మ స్వరూపం అయిన చిత్రసేనను కాపలాగా ఉంచుతాడు. అయితే చిత్రసేన ఒక షరతు పెడతాడు. తాను ఆ పువ్వుకు కాపలాగా ఉండాలంటే తనకు కుండలో కల్లు, తినడానికి ఏదైనా జంతువు కావాలని అడుగుతాడు. ఇందుకు పరశురాముడు సరే అంటాడు.
ఓసారి పరశురాముడు వేటకు వెళ్లగా చిత్రసేన కొలనులో కనిపించిన పువ్వుతో తానే స్వయంగా శివుడిని పూజించాలని అనుకుంటాడు. అది చూసిన పరశురాముడికి ఒళ్లు మండిపోతుంది. కోపోద్రిక్తుడై చిత్రసేనతో యుద్ధానికి దిగుతాడు. అప్పుడు శివయ్య ప్రత్యక్షమై వారిని శాంతింపజేసి తామిద్దరినీ తనలో లీనం చేసుకుంటానని అంటాడు. అలా గుడిమల్లంలో శివుడు బ్రహ్మ, విష్ణు రూపాలతో కొలువై ఉన్నాడు.