TSPSC Leak: రేణుక, ఆమె భర్తను ఉద్యోగాల నుంచి తొలగింపు
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన TSPSC ప్రశ్నాపత్రాల వ్యవహారంలో రోజురోజుకీ మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 9 మంది నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. వీరిలో ప్రధాన నిందుతులైన రాజశేఖర్, ప్రవీణ్, రేణుకను వేర్వేరుగా విచారించగా.. పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజశేఖర్ ఈ కేసులో ప్రధాన సూత్రధారి కాగా.. అతను కంప్యూటర్ల పాస్‌వర్డులు తెలుసుకుని.. అందులోని ప్రశ్నాపత్రాలను కాపీ చేసి ప్రవీణ్‌కు ఇచ్చేవాడని తెలిసింది. వాటిని ప్రవీణ్ తీసుకుని రేణుకకిచ్చి.. తన దగ్గర పేపర్లు ఉన్నాయని అభ్యర్థులను ఆకర్షించి డీల్ సెట్ చేయాలని సూచించేవాడని తెలిసింది.
ఉద్యోగాల నుంచి రేణుక, ఆమె భర్త తొలగింపు..
టీఎస్‌పీఎస్సీలో పేపర్ లీకేజ్ వ్యవహారంలో రేణుక పాత్ర కీలకంగా ఉందని గుర్తించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. దీనిలో భాగంగా రేణుకతోపాటు ఆమె భర్త డాక్యా నాయక్‌లను అధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారు. రేణుక వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం బుద్ధారం బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తోంది. ఈమేరకు ఆమెను సస్సెండ్ చేయాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో రేణుకని సస్పెండ్ చేశారు. ఇక రేణుక భర్త డాక్యా నాయక్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపిడివో కార్యాలయంలో ఉపాధి హామీలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అధికారులు ఆయనను విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.