KTR: మ‌హిళా మంత్రిని వేధిస్తున్నారు.. జాలేస్తోంది

Telangana Elections: తెలంగాణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ఈరోజు తెలంగాణ‌లో నామినేష‌న్లు కూడా మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో KTR మీడియాతో మాట్లాడుతూ మూడోసారి కూడా తామే వ‌స్తామ‌న్న కాన్ఫిడెన్స్ ఉంద‌ని ఇత‌ర పార్టీలు త‌మ గురించి ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోర‌ని అన్నారు. మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు KTR ఇచ్చిన మ‌రిన్ని స‌మాధానాలు ఇవే.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయ‌న్న భ‌యం మీలో అస‌లు క‌నిపించ‌డంలేదు. మీ కాన్ఫిడెన్స్ ఏంటి స‌ర్?

భ‌యం ఎందుకు? గ‌త 9 ఏళ్ల‌లో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామో అంద‌రికీ తెలుసు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మీపై మీ పార్టీపై చేస్తున్న ఆరోప‌ణ‌ల ప‌ట్ల మీ స‌మాధానం ఏంటి?

అస‌లు తెలంగాణ ఎన్నిక‌ల్లో BJP పోటీలోనే లేదేమో అనిపిస్తోంది. ప్ర‌ధాని, హోంమంత్రి ఇలా ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా ప్ర‌జ‌ల‌కు మ‌భ్య‌పెట్టాల‌ని చూసినా ఫ‌లితం లేదు. ఎందుకంటే వారికంటే ప్ర‌జ‌లే ఎంతో స్మార్ట్.

ఇప్పుడు కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ ర‌చ్చ ఎక్కువ‌గా ఉంది. కాంగ్రెస్ కూడా ఈ ప్రాజెక్ట్‌ని అడ్డం పెట్టుకుని KCR.. ఆయ‌న ఫ్యామిలీ అక్ర‌మాల‌కు పాల్ప‌డింది అంటున్నారు. మీరేమంటారు?

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ విలువ రూ.80,000 కోట్లు. కానీ మేం ల‌క్ష కోట్లు తినేసామ‌ని రాహుల్ గాంధీ అంటున్నారు. ఇక్కడే మీకు అర్థం అవ్వాలి రాహుల్ ఎంత తెలివిగ‌ల‌వాడు అని. బ‌హుశా ఇందుకే రాహుల్‌ను అంద‌రూ ప‌ప్పు అంటారేమో. ముందు వెనుక తెలుసుకుని మాట్లాడ‌రు.

రేవంత్ రెడ్డి అవును నేను ప‌ప్పునే.. కొడంగ‌ళ్ ప‌ప్పుని.. అది ఆరోగ్యానికి ఎంతో మంచిది అని సెటైర్ వేసారు. మీ అభిప్రాయం ఏంటి?

నేను థ‌ర్డ్ గ్రేడ్ క్రిమినల్స్ గురించి మాట్లాడను. వారు అనేమాట‌లు ప‌ట్టించుకోను.

ఒవైసీ మ‌ళ్లీ సీఎం కేసీఆరే అని రాహుల్ గాంధీకి స‌వాల్ విసిరారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?

ఒవైసీ ఆ మాట అన్నందుకు ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు. కానీ ఒవైసీ రాహుల్‌కి ఏం స‌వాల్ విసిరారో నాకు తెలీదు. నేను దీని గురించి మాట్లాడ‌లేను.

కర్ణాట‌క‌లో మేం చేసిన అభివృద్ధిని చూసి మాకు ఓటెయ్యండి అని కాంగ్రెస్ అడుగుతోంది. మీరేమంటారు?

అవును చూస్తూనే ఉన్నాం ఎంత అభివృద్ధి చెందిదో. బ‌ళ్లారిలో క‌రెంట్ కోత‌ల‌తో ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డుతున్నాయి. క‌రెంట్ లేక ప్ర‌జ‌ల అల్లాడుతున్నారు.

TMC మంత్రి మ‌హువా మోయిత్రాపై BJP సిట్టింగ్ ఎంపీ ఆరోప‌ణ‌లు చేసారు. ఆమెను నైతిక విలువ‌ల కమిటీ విచారించింది. మీరేమనుకుంటున్నారు?

నైతిక విలువ‌లు అనే ప‌ద‌మే జోక్‌గా ఉంది. ఎవ‌రికి విలువ‌లు ఉన్నాయో ఎవ‌రికి లేవో భార‌త‌దేశం చూస్తోంది. పార్ల‌మెంట్‌లో ప్ర‌శ్నిస్తే కేసులు విచార‌ణ‌లు చేస్తున్నారు. నిజంగా త‌ప్పులు చేస్తున్నవారు హాయిగా తిరుగుతున్నారు.

ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌య్యే స‌మ‌యంలో నేను జైల్లో ఉంటానేమో అని దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. దీని గురించి మీ స్పందనేంటి?

నేను ఈ అంశాల గురించి మాట్లాడకూడ‌దు. కానీ కేంద్రాన్ని ప్రశ్నించేవారిపై ఇలాంటి కేసులు పెట్టి లోప‌ల వేయిస్తుంటే వారి ప‌ట్ల జాలేస్తోంది.

వ‌ర‌ల్డ్ క‌ప్ చూస్తున్నారా స‌ర్?

ఇప్పుడు నేనున్న బిజీలో అస్స‌లు చూడ‌టం కుద‌ర‌డంలేదు. ట్విటర్ ఫీడ్‌లో చూసి తెలుసుకుంటున్నాను.