నాని పేరు చాల‌దా.. స్టార్ అని పెట్టాలా?

త‌మ అభిమాన హీరోల‌పై ప్రేమ‌తో వారికి స్టార్ ట్యాగ్స్ ఇచ్చేస్తుంటారు ఫ్యాన్స్. అలా పుట్టుకొచ్చిన‌వే ఈ మెగాస్టార్, ప‌వ‌ర్ స్టార్, స్టైలిష్ స్టార్, సూప‌ర్ స్టార్ ట్యాగ్స్. అయితే నానికి కూడా ఫ్యాన్స్ ఓ ట్యాగ్ ఇచ్చారు. అదే నేచుర‌ల్ స్టార్. ఆయ‌న సినిమాల్లో న‌టించే విధానం కూడా జీవిస్తున్న‌ట్లు ఉంటుంద‌ని, ఎలాంటి సీన్ అయినా నేచుర‌ల్‌గా చేసేస్తార‌ని ఫ్యాన్స్ అభిప్రాయం. అందుకే ఆయ‌న‌కు ఆ టైటిల్ ఇచ్చారు. అయితే ఈ టైటిళ్లు అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నిస్తున్నారు నాని.

ఆయ‌న హీరోగా న‌టించిన సినిమా ద‌స‌రా. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో నానికి జోడీగా కీర్తి సురేష్ న‌టించారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాను తెలుగుతో పాటు మొద‌టిసారి త‌మిళం, హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. నాని కెరీర్‌లో మొద‌టి ప్యాన్ ఇండియా సినిమాగా చెప్పుకోవ‌చ్చు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నాని ఫ్యాన్స్‌తో ముచ్చ‌టించారు. ఈ నేప‌థ్యంలో వారు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన స్టైల్‌లో స‌మాధానాలు ఇచ్చారు. ఓ అభిమాని.. నేచుర‌ల్ స్టార్ అని పిల‌వ‌డం ఎలా అనిపిస్తుంది? అని అడగ్గా.. ఇందుకు నాని స‌మాధాన‌మిస్తూ.. “నాకు స్టార్ ట్యాగ్స్ ఇష్టం లేదు. మ‌న పేరు పెద్ద బ్రాండ్ అవ్వాలి. నాని అని పెడితే స‌రిపోదా? దానికి ముందు ఇంకొక‌టి పెడితే కానీ వెయిట్ రాదా?” అన్నారు. శ్రీకాంత్ ఓదెల‌కి ఇది మొద‌టి సినిమా. ఇంత స్టార్ స్టేట‌స్ వ‌చ్చాక కొత్త డైరెక్ట‌ర్‌కు ఛాన్స్ ఇవ్వ‌డం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అని అడ‌గ్గా.. “సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌లో నేను కూడా కొత్త‌వాడినే. అప్పుడు అనుభ‌వం ఉన్న డైరెక్ట‌ర్లు నాకు అవ‌కాశం ఇచ్చారుగా. ఇదీ అంతే” అని తెలిపారు నాని. మార్చి 30న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.