షర్మిళ కంటతడి.. నాకు గెలుపు కంటే త్యాగం ముఖ్యం
తెలంగాణ ఎన్నికల్లో (telangana elections) పోటీ చేయడంలేదని ప్రకటించారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ (ys sharmila). కాంగ్రెస్‌తో కలవకుండా ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని అదే జరిగితే మళ్లీ తెలంగాణకు కేసీఆరే సీఎం అవుతారని అలా జరగకూడదనే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ (rahul gandhi) కర్ణాటకలో చేసిన పాదయాత్ర వల్ల మంచి ఫలితాలు వచ్చాయని తెలంగాణలో కూడా అవే ఫలితాలు రావాలన్న ఉద్దేశంతోనే పోటీ నుంచి తప్పుకుంటున్నానని అన్నారు. YSRTP పెట్టినప్పటి నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రజల మంచి కోసమే తీసుకున్నామని.. ఈరోజు పోటీ చేయడంలేదంటే అది కూడా వారి మంచి కోసమేనని తెలిపారు.
YSRTP కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌కే ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇది చాలా కష్టంతో తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఎంతో మనోవేదన చెందుతున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు అంటే తాను ఇంకా యుద్ధం చేసే సమయం రాలేదు అని అర్థమని త్వరలో ఆ సమయం కూడా వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యకర్తలు తన నిర్ణయం పట్ల నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరారు.
“” ఓపిక, చిత్తశుద్ధి లేకపోతే రాజకీయాల్లో ఉండలేం. పాలేరు ప్రజల కోసం నిలబడతానని అన్నాను కానీ ఈరోజు పాలేరులో ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరులో నిలబడుతున్నారు. 2013లో నేను 3100 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఖమ్మంలో దాదాపు 600 కిమీలు పాదయాత్ర చేస్తే అక్కడ ప్రతి రోజు నా పక్కనే ఉన్నారు పొంగులేటి అన్న. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఆ బాధ భరించలేక 700 మంది చనిపోతే వారిలో 400 మంది తెలంగాణ ప్రజలు.
వారి ఇంటికి వెళ్లి పరామర్శించాలని ఓదార్పు యాత్ర చేస్తే ప్రతి ఇంటకీ నాతోపాటు వచ్చిన వ్యక్తి ఆయన. నేను ఆయన కోసం ప్రచారం చేసాను. ఆయన గెలుపునకు కారణం అయితే ఆరోజు సంతోషించాను. ఈరోజు నేను పాలేరులో పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన కూడా పాలేరులోనే పోటీ చేస్తానని అన్నారు. ఇప్పుడు పాలేరు ప్రజలే సమాధానం చెప్పాలి. నన్నేం చేయమంటారు? మొండిగా తెగించి బరిలోకి దిగమంటారా? పొంగులేటిని ఓడించమంటారా నన్ను ఓడిపోమంటారా? నా తండ్రి అభిమానులు ఏం కోరుకుంటున్నారు? గెలుపు గొప్పదే. కానీ త్యాగం అంతకంటే గొప్పది. ఏనాటికైనా పాలేరు ప్రజల ఓట్లు దక్కించుకుంటా “” అంటూ కంటతడి పెట్టుకున్నారు (ys sharmila)