Israel: లీకైన‌ సీక్రెట్ డాక్యుమెంట్.. అందులో ఏముంది?

Israel Gaza War: ఇజ్రాయెల్‌కి సంబంధించిన ఓ సీక్రెట్ డాక్యుమెంట్‌ను వికీ లీక్స్ బ‌య‌ట‌పెట్టింది. ఆ డాక్యుమెంట్‌పై ఇప్పుడు పాలెస్తీనా, ఈజిప్ట్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఇంత‌కీ ఆ డాక్యుమెంట్‌లో ఏముందంటే.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నేత‌న్యాహు (benjamin netanyahu) గాజా ప్ర‌జ‌ల‌ను ఈజిప్ట్‌లోని సినాయ్ (ద‌క్షిణ గాజా) ప్రాంతానికి త‌ర‌లించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.

వారంద‌రినీ సినాయ్‌కు త‌ర‌లించేస్తే అప్పుడు ఉత్త‌ర గాజాలో దాడుల‌కు పాల్ప‌డేందుకు వీలుగా ఉంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. దీని కోసం రాఫా బోర్డ‌ర్ ఒక మూడు రోజుల పాటు తెరిచే ఉంచాల‌ని కూడా ఆ డాక్యుమెంట్‌లో రాసుంద‌ట‌. ఈ డాక్యుమెంట్ మొద‌ట హెబ్రూ వెబ్‌సైట్ అయిన మెకోమిట్‌లో ప‌బ్లిష్ చేసారు. ఆ డాక్యుమెంట్‌లో రాసిన ప్ర‌తీ విష‌యం ఇజ్రాయెల్ మిలిట‌రీ ఇంటెలిజెన్స్ అధికారులు ధృవీకరించారు కాబ‌ట్టే ప్ర‌చురించామ‌ని తెలిపారు. అయితే నేత‌న్యాహు అధికార కార్యాల‌యం మాత్రం ఆ డాక్యుమెంట్ ఊహాత్మ‌క‌మైన‌ద‌ని కొట్టిపారేసింది. (israel gaza war)

ఈ డాక్యుమెంట్‌పై పాలెస్తీనా, ఈజిప్ట్ ప్ర‌భుత్వాలు మండిపడుతున్నాయి. ఉత్త‌ర గాజా ప్ర‌జ‌లు త‌మ సినాయ్ ప్రాంతంలోకి వ‌చ్చి కూర్చుంటే త‌మ ప్ర‌జ‌ల‌కు క‌ష్టంగా ఉంటుంద‌ని అంత మందికి స్థ‌లం లేద‌ని అంటోంది. మ‌రోప‌క్క గాజాను ఆక్ర‌మించుకోవ‌డానికి ఇజ్రాయెల్ నాట‌కాలు ఆడుతోంద‌ని పాలెస్తీనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. 1948లో పాలెస్తీనా వాసుల‌ను గెంటేసిన‌ట్లే ఇప్పుడు కూడా జ‌రిగే ప్ర‌మాదం ఉందని అంటోంది. ఇక్క‌డ అనుమానం క‌లిగిస్తున్న మ‌రో అంశం ఏంటంటే గాజా వాసుల‌ను హ‌మాస్‌కు చెందిన సంస్థ‌లు ఎక్కువ‌గా ఉన్న ద‌క్షిణ ప్రాంతానికి త‌ర‌లించి అక్క‌డ ఉన్న హ‌మాస్‌ను అంత‌మొందించాల‌ని ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోంది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల అర‌బ్ దేశాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే అవ‌కాశం లేక‌పోలేదు.