ఎలాంటి పాపాలు చేస్తే ఏ న‌ర‌కానికి వెళ్తారు?

Spiritual: పాపాలు చేయ‌కురా న‌ర‌కానికి (hell) పోతావు అంటుంటారు. మ‌న‌కు స్వ‌ర్గం న‌ర‌కం మాత్ర‌మే తెలుసు. కానీ న‌ర‌కం అనేది ఒక‌టే కాదట‌. ఏకంగా 9 ర‌కాల న‌ర‌కాలు ఉన్నాయ‌ని మ‌న హిందూ పురాణాలు చెప్తున్నాయి. ఇంత‌కీ ఆ న‌ర‌కాలేంటో చూసేద్దాం.

త‌మిస్ర‌

త‌మిస్ర అనే న‌ర‌కంలో వెలుతురు అనేది అస్స‌లు ఉండ‌దు. మొత్తం అంధ‌కార‌మే నిండి ఉంటుంద‌ట‌. ఇత‌రుల డ‌బ్బును, సంప‌ద‌ను కాజేయాల‌ని చూసేవారిని య‌మ భ‌టులు తాళ్లతో కొడుతూనే ఉంటార‌ట‌.

అంధ‌ త‌మిస్ర‌

ఇది త‌మిస్ర‌కు బాబు లాంటిది. ఇక్క‌డ ఎంత‌టి అంధ‌కారం ఉంటుందంటే.. చూపున్న‌వారు కూడా అంధులైపోతారు. మ‌గ‌వారు కానీ ఆడ‌వారు కానీ త‌మ భాగ‌స్వామ్యుల‌ను డ‌బ్బు కోసం వాడుకోవాల‌ని చూస్తే వారికి ఈ న‌ర‌కంలో శిక్ష ప‌డుతుంద‌ట‌.

రౌర‌వ‌

ఇత‌రుల‌ను మోసం చేసి వారికి ద‌క్కాల్సిన లాగేసుకోవాల‌ని చూస్తే రౌర‌వ న‌రకానికి పోతారు. రౌర‌వ న‌ర‌కంలో శిక్ష విధించేది స‌ర్పాలు. ఈ న‌ర‌కంలో పాము ఆత్మ‌ల శ‌రీరాల‌ను చుట్టేసి గ‌ట్టిగా బిగించేసి కాట్లు వేస్తూనే ఉంటుంది.

మ‌హా రౌర‌వ‌

ఇది రౌర‌వ కంటే రెండు రెట్లు క‌ఠినంగా ఉంటుంది. ఇత‌రుల‌కు హాని క‌లిగించి సుఖాలు అనుభ‌వించేవారికి ఈ న‌ర‌కంలో శిక్ష ప‌డుతుంది. రురు అనే పురుగులు శ‌రీరాన్ని పీక్కుతినేలా ఈ శిక్ష ఉంటుంది.

కుంభిపాక‌

ఈ కుంభిపాక న‌ర‌కంలో పాపాలు చేసిన‌వారిని ఓ పెద్ద గిన్నెలో వేసి కింద నిప్పు పెట్టి మ‌రీ ఉడికిస్తారు. క్రూర‌మైన నేరాలు పాపాలు చేసిన‌వారికి ఈ కుంభిపాక శిక్ష ప‌డుతుంది. ముఖ్యంగా జంతువుల ప‌ట్ల హాని క‌లిగించేవారు కుంభిపాక శిక్షార్హులు.

కాళ‌సూత్ర‌

ఇత‌రుల‌ను అవ‌మానించ‌డం, అగౌర‌వంగా మాట్లాడేవారికి ఈ కాళ‌సూత్ర న‌ర‌కం త‌ప్ప‌దు. ముఖ్యంగా బ్రాహ్మ‌ణుల ప‌ట్ల త‌ప్పుగా ప్ర‌వ‌ర్తిస్తే ఈ న‌ర‌కానికి పోతారు. ఈ న‌ర‌కంలో నిప్పుల్లో న‌డిపించి మ‌రీ శిక్షిస్తారు.

అసిప‌త్ర‌వాన‌

త‌మ‌కున్న బాధ్య‌త‌ల‌ను మ‌రిచి ఇత‌రుల ద‌క్కాల్సిన‌వి ద‌క్కించుకోవాల‌ని చూసేవారికి ఈ న‌ర‌కంలో శిక్ష ఉంటుంది. ఈ న‌ర‌కంలో ముళ్లున్న తాడుతో కొడుతూనే ఉంటారు.

శుఖ‌ర‌ముఖ‌

ఈ న‌ర‌కం ప‌రిపాలించేవారు అన్యాయానికి పాల్ప‌డేవారికి. బాధ్య‌త‌ల‌ను మ‌రిచి ప్ర‌జ‌ల‌ను దోచుకునేవారు ఈ న‌ర‌కానికి వెళ్తారు.

అంధ‌కూపం

సాయం చేసేందుకు వ‌న‌రులు ఉన్న‌ప్ప‌టికీ ఆప‌ద‌లో ఉన్న‌వారికి సాయ‌ప‌డ‌ని వారికి ప‌డే శిక్ష ఇది. ఈ న‌ర‌కంలో జంతువులు, పురుగులు మీద ప‌డి దాడి చేస్తూనే ఉంటాయి.