ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ లేనట్లే.. మంత్రి కీలక వ్యాఖ్యలు!
ఏపీలో వచ్చే ఎన్నికలలోపు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తారని చాలా మంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ఇప్పటికైతే కనిపించట్లేదు. ఇక ముఖ్యంగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం పెద్దఎత్తున అభ్యర్థులు ఎదురుచూస్తున్న తరుణంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగులను నీరుగార్చుతున్నాయి. శాసనమండలిలో సోమవారం జరిగిన సమావేశాల్లో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈక్రమంలో మంత్రి బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉంది.. 717 ఉపాధ్యాయ పోస్టులేనని చెప్పారు. దీంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు తీవ్రంగా మండిపడ్డారు. గతంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటు సాక్షిగా రాష్ట్రంలో 50,670 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారని ఎమ్మెల్సీలు తెలిపారు. అసలు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచన మీ ప్రభుత్వానికి ఉందా లేదా అని అడిగారు.
మంత్రి బొత్స ఏమన్నారంటే..
దేశంలోనే అత్యధికంగా ఉపాధ్యాయులున్న రాష్ట్రం ఏపీ అని మంత్రి బొత్స పేర్కొన్నారు. 2019లో డీఎస్సీ ద్వారా 14219 పోస్టులను భర్తీ చేశామని.. 2018, 1998లో నిర్వహించిన డీఎస్సీలో అర్హత సాధించిన వారికి ఇటీవల నియామకాలు ఇస్తున్నామని తెలిపారు. అవిన్నీ పోగా… ఇంక మిగిలింది 717 మాత్రమే ఖాళీలున్నాయని తెలిపారు. కానీ డీఎస్సీ ఇవ్వాలనే ఆలోచన ఉందని.. పరిశీలిస్తున్నాం.. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తాం అని చెప్పారు. దీనిపై పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం తీవ్రంగా స్పందించారు. కొత్త డీఎస్సీ ఇస్తారో లేదో స్పష్టం చేయకుండా.. ఎప్పుడో చేసిన నియామకాల గురించి ఇప్పుడు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో నాలుగేళ్ల నుంచి ఉపాధ్యాయ ఖాళీలు ఎన్ని ఉన్నాయి.. కొత్త డీఎస్సీ ఎప్పుడు ప్రకటిస్తారో స్పష్టంగా చెప్పాలని గట్టిగా డిమాండ్ చేశారు. మరోవైపు జగన్ ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా వేయలేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆక్షేపించారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50,670 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటులో చెప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. అయితే ఇవన్నీ కరోనాకు ముందు లెక్కలని, అప్‌డేట్ చేయకముందువంటూ బొత్స చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలలపై కమిటీ వేస్తామని.. దానికి ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానిస్తామని బొత్స పేర్కొన్నారు.
అరకొర పోస్టులతో ఇవ్వొచ్చు..
రాష్ట్రంలో కేవలం 717 ఉపాధ్యాయ పోస్టులే ఖాళీగా ఉన్నాయన్న మంత్రి బొత్స సత్యనారాయణ.. త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే విషయమై కమిటీ వేస్తామన్నారు. అయితే.. రాష్ట్రంలో 5,251 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ నెలాఖరులోగా 4,134 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని.. అయితే ఇవి కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌తో కాకుండా 1998, 2018 డిఎస్సీ అభ్యర్దులతో భర్తీ చేయనున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే ఇక మిగిలేది కేవలం 717 పోస్టులు మాత్రమేనని స్పష్టం చేశారు. దీంతో ఏపీలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇక లేనట్లే అన్నట్లు పరోక్షంగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయి.