Telangana Elections: ఆవిరైపోతోందా?

Telangana Elections: తెలంగాణ ఎన్నిక‌లు అన‌గానే ప్ర‌జ‌ల‌కు ముందు గుర్తొచ్చేది అధికార పార్టీ ఆ త‌ర్వాత ప్రత్య‌ర్ధి పార్టీ. మ‌న‌కు తెలంగాణ‌లో BRS పార్టీకి ప్ర‌త్య‌ర్ధి పార్టీలుగా కాంగ్రెస్, BJP ఉన్నాయి. కానీ ఇప్పుడు BJP రాష్ట్రంలో ఆవిరైపోతున్న‌ట్లు అనిపిస్తోంది. ఎవ్వ‌రూ కూడా అస‌లు BJP అనేది ఒక‌టి రాష్ట్రంలో ఉంద‌ని.. ఆ పార్టీ కూడా పోటీ చేస్తోందని గుర్తించ‌లేక‌పోతున్నారు. ఇప్పుడు ప్ర‌జ‌లు అంతా కూడా అయితే అధికారంలోకి BRS లేదా కాంగ్రెస్ (congress) వ‌స్తుంద‌నే అనుకుంటున్నారు.

స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీకి నేత‌లు జంప్ అవుతుంటారు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో BRS నుంచి కాంగ్రెస్‌కి కాంగ్రెస్ నుంచి BRSకి జంప్ అవుతున్న‌వారే ఎక్కువ‌గా ఉన్నారు కానీ BJPలోకి జంప్ అయిన‌వారు పెద్దగా లేరు. ఇంకా చెప్పాలంటే BJP నుంచే కాంగ్రెస్‌లోకి వెళ్లిన‌వారు ఉన్నారు. ఇందుకు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డే (komatireddy rajagopal reddy) ఉదాహ‌ర‌ణ‌. ప్ర‌జ‌లు కూడా కాంగ్రెస్ రావాల‌నే కోరుకుంటున్నార‌ని KCRను గ‌ద్దె దించే స‌త్తా కాంగ్రెస్‌కు మాత్ర‌మే ఉంద‌ని ఆయ‌న అన్న మాట‌లు 90% నిజ‌మేన‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మునుగోడు (munugode) ఉప ఎన్నిక BJPకి తెలంగాణ‌లో బాగానే హైప్ తీసుకొచ్చింది. ఆ త‌ర్వాత ఉప ఎన్నిక‌లో రాజ‌గోపాల్ రెడ్డి ఓడిపోవ‌డంతో అక్క‌డే పార్టీ స‌త్తా ఏంటో ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయింది. రాజ‌గోపాల్ రెడ్డి BJPలోకి వెళ్లారు క‌దా అని ఆయ‌న్ను చూసి ఇత‌ర నేత‌లు కూడా అటు జంప్ అయ్యారు. కానీ వారి ప‌రిస్థితి ఇప్పుడు అంధ‌కారంలో ఉంద‌నే చెప్పాలి. పార్టీలో ఉండ‌లేక బ‌య‌టికి రాలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. కాక‌పోతే వారు బ‌య‌టికి వ‌చ్చి చెప్పుకోలేక‌పోతున్నారు. (telangana elections)

ఇప్పుడు తెలంగాణ‌లో బాగా యాక్టివ్‌గా ఉన్న BJP నేత‌లు ఎవ‌రైనా ఉన్నారంటే అది బండి సంజ‌య్, కిషన్ రెడ్డి, డీకే అరుణ‌, ఈటెల రాజేంద‌ర్. కాక‌పోతే అరుణ‌, రాజేంద‌ర్ ఇత‌ర పార్టీల నుంచి BJPలో చేరినవారు. అలా ఇత‌ర పార్టీల నుంచి BJPలో చేరిన‌వారిలో వీరిద్ద‌రు మాత్ర‌మే యాక్టివ్‌గా ఉన్నారు. మిగ‌తా వారు ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్న‌ట్లు ఉంది వారి ప‌రిస్థితి. ఇక BJPకి చెందిన సీనియ‌ర్ నేత‌లు విజ‌య‌శాంతి, కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, వివేక్ వెంక‌ట స్వామిలు కూడా పార్టీని వీడే అవ‌కాశాలు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ అలాంటిదేమీ లేద‌ని వారు చెప్తున్నారు. కానీ వారు ఎక్క‌డా కూడా భార‌తీయ జ‌న‌తా పార్టీకి సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో క‌నిపించ‌డంలేదు.

నిజానికి భార‌తీయ జ‌నతా పార్టీలో ఉన్న చాలా మందికి భార‌త రాష్ట్ర స‌మితిని ఎదుర్కొనే స‌త్తా BJPకి లేద‌ని అర్థ‌మ‌వుతోంది. అందుకే ఎప్పుడెప్పుడు కాంగ్రెస్‌లోకి జంప్ అవుదామా అని చూస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ నాలుగు లోక్ స‌భ సీట్ల‌ను గెలుచుకుంది. దాంతో అధికార BRSకి ఇప్పుడు ధీటైన పార్టీ BJPనే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచాక అక్క‌డ ప్ర‌క‌టించిన మానిఫోస్టోనే ఇక్క‌డా ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌జ‌ల ఫోక‌స్ కాంగ్రెస్ వైపు మ‌ళ్లింది.

జ‌న‌సేన‌-BJP పొత్తుకి లేని క్రేజ్

తెలంగాణ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌ (janasena), భార‌తీయ జ‌న‌తా పార్టీ క‌లిసి బ‌రిలోకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. జ‌న‌సేన తెలంగాణ‌లో పోటీ చేయ‌డం ఇదే తొలిసారి. ఏవైనా పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి అంటే అది ఎంతో చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది. కానీ జ‌న‌సేన‌, BJP పొత్తుపై అంత చ‌ర్చ ఏమీ జ‌ర‌గ‌డంలేద‌నే తెలుస్తోంది. అదే ఏపీలో జ‌న‌సేన తెలుగు దేశం పార్టీ పొత్తుకు వ‌చ్చిన క్రేజ్ తెలంగాణ‌లో BJPతో పెట్టుకుంటే రావ‌డంలేదు. (telangana elections)