Happy Marriage: దాంప‌త్య జీవితం స‌జావుగా సాగాలంటే..

Happy Marriage: ఈ మ‌ధ్య‌కాలంలో నాలుగు రోజుల్లో ప్రేమ‌.. వారం రోజుల్లో పెళ్లి.. నెల రోజుల‌కే విడాకులు అయిపోతున్నాయి. అస‌లు నిజంగానే ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఉండి ఉంటే.. విడాకుల దాకా ఎందుకు వెళ్లాల్సి వ‌స్తోంది? ఒక‌వేళ భార్యో భ‌ర్తో వేరొక‌రితో మోసం చేస్తుంటే వారితో క‌లిసి ఉండ‌టంలో అర్థంలేదు. ఎందుకంటే మొద‌టి త‌ప్పు క‌దా అని క్ష‌మించినా అలాంటివారు మార‌తార‌న్న గ్యారెంటీ లేదు. ఇలాంటి ప‌రిస్థితులు రాకుండా దాంప‌త్య జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఈ టిప్స్ పాటించ‌క త‌ప్ప‌దు అని అంటున్నారు రిలేష‌న్‌షిప్ ఎక్స్‌ప‌ర్ట్స్. ఆ టిప్స్ ఏంటో చూద్దాం.

ఆ చిలిపిత‌నం ఉండాలి

ఆఫీస్‌కి వెళ్లే ముందు లేదా వెళ్లి వ‌చ్చాక మీ పార్ట్‌న‌ర్‌ను హ‌త్తుకుని ప్రేమ‌గా ప‌ల‌క‌రించండి. వీలైతే చిన్న ముద్దు. ఇవ‌న్నీ చాలా చిన్న అంశాలే అయిన‌ప్ప‌టికీ బాండింగ్ స్ట్రాంగ్‌గా మార్చే శ‌క్తి వీటికే ఉంది.

టీమ్ వర్క్

ఇంట్లో ఒక‌రే ప‌ని చేస్తుంటే వారు కూడా విసిగిపోతుంటారు. ఈ సాయం చేసిపెట్టు అని అడ‌గ‌లేక‌పోతుంటారు. నిజానికి ఇంట్లో భార్యాభ‌ర్త‌లు క‌లిసి ప‌నులు చేసుకోవాలి. భార్యే ఇంటి ప‌నులు చేయాలి అనుకునే మ‌న‌స్త‌త్వం ఈరోజుల్లో ప‌నికిరాదు. నిజానికి సాయం అడ‌గ‌న‌క్క‌ర్లేదు. జీవిత భాగ‌స్వామిపై ప్రేమ ఉంటే వారంతట వారే వ‌చ్చి కాస్త చేయందిస్తారు. ఒక‌వేళ మీ పార్ట్‌న‌ర్ సాయం చేయ‌డం లేద‌నుకోండి.. మీరే కాస్త కూర్చోపెట్టి ఒక్క‌రే ప‌నులు చేసుకోవాలంటే ఎంత క‌ష్టంగా ఉందో చెప్పండి. మాట్లాడ‌కుండా ముందే నాకు సాయం చేయడంలేదు అని అరిచేయ‌కండి. (happy marriage)

మాట్లాడుకుంటున్నారా?

ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌న‌సులు క‌లిస్తే స‌రిపోదు.. జీవితాంతం క‌లిసి ఉండాలంటే మెరుగైన క‌మ్యూనికేష‌న్ ఉండాలి. మీరు చెప్పాల‌నుకునేవి నిజాయ‌తీగా చెప్పండి. ఒక‌రినొక‌రు అర్థం చేసుకోండి. మ‌న‌సు విప్పి మాట్లాడేందుకు ఏమాత్రం భ‌య‌ప‌డ‌కండి.

న‌మ్మకం

ఈరోజుల్లో మ‌నం గ‌మ‌నించిట్లైతే.. ఫోన్ పాస్‌వ‌ర్డ్స్ కావాలి.. ఎక్క‌డికి వెళ్లినా లొకేష‌న్ షేర్ చేయాలి.. ఎవ‌రితో వెళ్లావో వారితో క‌లిసి దిగిన ఫోటోలు షేర్ చేయాలి అని డిమాండ్ చేసే వారిని ఎక్కువ‌గా చూస్తున్నాం. ఇలా ఎందుకు జ‌రుగుతోందంటే ఇద్ద‌రి మ‌ధ్య న‌మ్మ‌కం లేక‌పోవ‌డం వ‌ల్ల‌. మీ భాగ‌స్వామి మీ సొంతం అయిన‌ప్పుడు వారు ఇంకొక‌రి వైపు క‌న్నెత్తి చూడ‌రు. ఒక‌వేళ మోసం చేస్తున్నారంటే మీలో అయినా లోపం ఉండాలి.. లేదా అవ‌త‌లి వ్య‌క్తి స్వ‌భావం అలాంటిదే అనుకోవాలి. ఇలాంటి వారిని జాగ్ర‌త్త‌గా అంచ‌నా వేయ‌గ‌లిగితే హార్ట్ బ్రేక్స్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. (happy marriage)

కాంప్లిమెంట్స్ కంప‌ల్స‌రీ

మీ భార్య మీకు క‌మ్మ‌గా వండిపెడితే.. చాలా బాగుంది అని ఒక చిన్న మాట అని చూడండి. అది మీకు చిన్న మాటే కావ‌చ్చు.. కానీ మీ పార్ట్‌న‌ర్‌కి వ‌ర‌ల్డ్ క‌ప్ కొట్టినంత ఆనందంగా ఉంటుంది. కాబ‌ట్టి ఒకరి కోసం ఒక‌రు చేసుకునే ప‌నులకు కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవ‌డం మాన‌కండి.