Ponnala Lakshmaiah: ముందే చెప్పచ్చు కదమ్మా.. చెప్పనేలేదే..!
Telangana Elections: కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య (ponnala lakshmaiah) ఇప్పుడు BRS పార్టీలో ఉన్నారు. ఆయన ఎంతో కాలంగా కాంగ్రెస్‌కు నమ్మిన బంటుగా వ్యవహరించారు. కానీ ఆయన అడిగిన జనగామ టికెట్ కాంగ్రెస్ ఇవ్వకపోవడం.. పార్టీలో ఎవ్వరూ తనకు గౌరవం ఇవ్వకపోవడంతో బయటికి వచ్చేసినట్లు తెలిపారు.
కాంగ్రెస్‌కు రాజీనామా
కొన్ని రోజుల క్రితం తనకు కాంగ్రెస్ నుంచి ఎలాంటి అవమానాలు ఎదురవుతున్నాయో పొన్నాల మీడియా ముందు క్లియర్‌గా బయటపెట్టారు. తను ఎంతో నమ్మకంతో కష్టపడి పనిచేస్తే సీనియర్ అన్న గౌరవం కూడా ఇవ్వలేదని బాధపడ్డారు. అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేసారు.
రేవంత్ తప్పుడు మాటలు
సాధారణంగా ఎన్నికల ముందు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్లిపోయేవారిపై ఆ పార్టీలోని ఇతర నేతలు కోపంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు వెళ్లిపోయేవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని వారి గురించి కూడా మాట్లాడటానికి ఇష్టపడరు. లక్ష్మయ్య రిజైన్ చేసారని తెలిసినప్పుడు వెంటనే రాహుల్‌తో మాట్లాడి ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సిన రేవంత్.. (revanth reddy) పోయే వయసులో పార్టీ మారడం అవసరమా అని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వలేదు. అది లక్ష్మయ్యను మరింత బాధించింది.
స్టెప్ తీసుకున్న KTR
లక్ష్మయ్య కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చేసారని తెలిసి ఆయన లాంటి సీనియర్ నాయకుడు BRS పార్టీలో ఉంటే బెటర్ అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR పొన్నాలను ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తమ పార్టీలో చేరారని అత్యున్నత పదవి ఇచ్చి గౌరవాన్ని కాపాడతామని మాటిచ్చారు.
రాహుల్ నుంచి ఫోన్
ఇంత జరిగాక ఇన్ని మాటలు పడ్డాక రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి పొన్నాలకు ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీ వచ్చి చర్చించాలని పిలుపు వచ్చింది. కోరిన జనగామ టికెట్ ఇస్తామని మాటిచ్చినట్లు తెలుస్తోంది. మరి నిజంగా పొన్నాల అవసరం కాంగ్రెస్‌కు ఉండి ఉంటే వెంటనే ఆయనకు సర్దిచెప్పి రాజీనామా చేయకుండా ఆపి ఉండాల్సింది. ఇప్పుడు మనసు విరిగిపోయి మరో పార్టీలో చేరిపోయాక మళ్లీ పిలవడం అనేది ఎంత వరకు సబబో వారికే తెలియాలి. వారు పిలిచినప్పటికీ తనను నోటికొచ్చినట్లు తిట్టి అవమానించిన కాంగ్రెస్‌లోకి మళ్లీ పొన్నాల వెళ్తారా అనే చర్చ కూడా మొదలైంది.
రహస్యంగా భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీతో మంతనాలు?
పొన్నాల పార్టీలో చేరిన మరుసటి రోజే కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీలు పొన్నాలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. రేవంత్ మాటలు పట్టించుకోవద్దని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ తోక కత్తిరించేస్తారని చెప్పారట. కాంగ్రెస్లోఉంటే మంచి పదవి వచ్చే అవకాశం ఉందని అదే BRS పార్టీలో ఉంటే మరిన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నూరిపోసినట్లు తెలుస్తోంది.
డైలమాలో పొన్నాల
అవమానించి రాజీనామా స్వీకరించిన కాంగ్రెస్‌కు తిరిగి వెళ్లాలా..? తన బాధను అర్థంచేసుకుని అక్కున చేర్చుకున్న BRS పార్టీని వీడాలా? అనే డైలమాలో ప్రస్తుతం పొన్నాల ఉన్నారు. రాహుల్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిన విషయంపై ఇప్పటివరకు పొన్నాల నోరు విప్పలేదు. మరి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారా అని అటు కాంగ్రెస్ వర్గాలు ఇటు BRS పార్టీ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.