ఈరోజు కవితను మళ్లీ విచారించనున్న ఈడీ
మద్యం కేసు కుంభకోణంలో భాగంగా BRS ఎమ్మెల్సీ కవితను ఈడీ ఈరోజు కూడా విచారించనున్నారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 వరకు విచారించిన తర్వాత కవిత.. తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు చెందిన అధికారిక గృహానికి చేరుకున్నారు. ఈరోజు కూడా ఈడీ కవితను 11 గంటలకు విచారించనుంది. అయితే కవిత ఈడీ ఆఫీసుకు వెళ్లాక గంటవరకు అధికారులు ఆమెను ప్రశ్నించలేదని తెలిసింది. ఇతర నిందితుల సమక్షంలో ముఖాముఖి ప్రశ్నలు అడుగుతున్నట్టు ఈడీ అధికారులు బయటకు లీకులు వదిలినప్పటికీ.. కవితను మాత్రం ఇంతవరకు ఎవరితోనూ కన్ఫ్రంటేషన్ చేయించలేదు. ఆమెను విడిగానే విచారించారు. అయితే మొత్తం 11 గంటల్లో కేవలం 14 ప్రశ్నలు మాత్రమే ఈడీ బృందం కవితను అడిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎక్కువ సమయం ఖాళీగా కూర్చోబెట్టినట్టు తెలుస్తోంది.