‘RRR సినిమాని ఎన్టీఆర్-బాలయ్యతో చేద్దామనుకున్నాం’
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కి ఆస్కార్‌ను కైవసం చేసుకున్న సినిమా ఆర్ఆర్ఆర్. విడుదలై ఏడాది కావస్తున్నా ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తూ ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తుంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రానికి పని చేసిన అందరూ తమ సంతోషాన్ని, సినిమా షూటింగ్ సమయంలో తమ అనుభవాలనూ పంచుకుంటున్నారు. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కార్తికేయ, రాహుల్ సిప్లిగంజ్ ఈ సినిమా సాధించిన విజయం పట్ల సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకోగా, తాజాగా ఈ సినిమాకు కథను అందించిన రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి పలు విషయాలను పంచుకున్న విజయేంద్ర ప్రసాద్ అసలు ఈ సినిమా కథ రాస్తున్నప్పుడు హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌ని తీసుకోవాలని అనుకోలేదనీ, చిరంజీవి– రామ్ చరణ్తోగానీ, బాలయ్య– ఎన్టీఆర్తోగానీ తీద్దామనుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘RRR కథని ముందుగా అనుకున్నప్పుడు రామ్ చరణ్ – ఎన్టీఆర్ పేర్లు మాకు తట్టలేదు. రామ్ చరణ్– చిరంజీవి కాంబినేషన్ లో చేద్దామా, లేదా ఎన్టీఆర్ – బాలయ్య కాంబినేషన్ లో చేద్దామా, సూర్య – కార్తీ కాంబినేషన్ లో చేద్దామా , ఇలా ఎన్నో కాంబినేషన్స్ ని అనుకున్నాం. కానీ రాజమౌళి.. ‘వేరే హీరోలతో అయితే ఈగో క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది. నాకు రామ్ చరణ్ – ఎన్టీఆర్ బాగా క్లోజ్, వాళ్ళతో అయితే నేను బాగా కంఫర్ట్ ఫీల్ అవుతాను’ అని చెప్పడంతో ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. అలా ఈ సినిమా పుట్టింది’ అంటూ చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. రామ్ చరణ్– ఎన్టీఆర్ నిజజీవితంలో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ చాలా తేలికగా సెట్ అయిపోయిందన్నారు.
ఇక, అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఇండియా తిరిగొచ్చిన రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ తమ పనులతో బిజీ అయ్యారు. తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సి15 షూటింగ్‌కు హాజరైన రామ్ చరణ్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ సినిమాలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్న ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నాటు నాటు పాటకి తనదైన స్టైల్లో స్టెప్స్ వేసి, కేక్ కట్ చేసి ఆర్ఆర్ఆర్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ఎన్టీఆర్ కూడా ఆస్కార్ అనంతరం హీరో విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొని అభిమానులను పలకరించారు. అంతేకాదు త్వరలోనే తన తదుపరి సినిమా మొదలవనుందని హింట్ ఇచ్చారు. అన్నట్టుగానే ఈ నెల 23న ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలు జరగనున్నాయని అధికారికంగా ప్రకటించేశారు మేకర్స్.