వివేకా హత్య కేసు: దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం ఆగ్రహం

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేపడుతున్న విచారణ అధికారి రాంసింగ్‌ వివరాలు రాబట్టడంలో చాలా జాప్యం చేస్తున్నారని.. వివేకా హత్య కేసు శివశంకర్‌రెడ్డి భార్య తులశమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం ధర్మాసనం వివేకా హత్యకేసు దర్యాప్తులో చోటుచేసుకుంటున్న ఆలస్యంపై మండిపడింది. అసలు కేసు విచారణ ఎంత వరకు వచ్చింది.. ఇన్ని రోజులు ఎంతమేరకు సాక్షులను విచారించారు అన్న విషయాలను కోర్టు సీబీఐ తరపు న్యాయవాది ద్వారా తెలుసుకుంది. ఇక తాజా పరిస్థితిపై నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. దీంతోపాటు విచారణకు సంబంధించి సీబీఐపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. దర్యాప్తు అధికారి రాంసింగ్‌ విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించించింది.

అవసరమైతే కొత్త అధికారిని నియమించండి..
వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యం అవుతున్నందున.. దర్యాప్తు అధికారిని అవసరమైతే మార్చాలని.. సుప్రీంకోర్టు పేర్కొంది. విచారణ త్వరగా ముగించలేకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి సమర్ధవంతుడు కాకపోతే ఆయన స్థానంలో వేరొకరిని నియమించడంపై సీబీఐ డైరక్టర్ అభిప్రాయం అడిగి చెప్పాలని సీబీఐ తరపు న్యాయవాది నటరాజన్‌ను న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై స్పందించిన నటరాజన్‌.. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని కోర్టుకు వివరించారు. అనంతరం కేసు విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.

తెలంగాణ హైకోర్టులో భాస్కర్‌ రెడ్డి పిటిషన్‌..
తెలంగాణ హైకోర్టులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఇవాళ పిటిషన్‌ దాఖలు చేశారు. వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్‌ ఆధారంగా తనను, తన కుమారుడు అవినాష్‌ రెడ్డిని విచారించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దస్తగిరినీ అప్రూవర్‎గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దస్తగిరి సీబీఐ చెప్పమన్నట్టు చెబుతున్నాడని.. అతను చెప్పిన విధంగా తమను ఈ కేసులో ఇరికించడం సరికాదన్నారు. దస్తగిరికి బెయిల్ ఇవ్వటం కూడా సరికాదని.. దాన్ని రద్దు చేయాలని కోరారు.