ఏపీలో కాకరేపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యేలపై నిఘా!

ఏపీలో పట్టభద్రులు, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. అయితే.. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి పోటీ లేకుండా ఏకపక్షంగా సాగుతాయి అనుకున్న ఈ ఎన్నికలు కాస్త ఇప్పుడు వేడెక్కాయి. ఎమ్మెల్సీ కోటా కింద ఏడు స్థానాలే ఖాళీగా ఉండగా… ఇప్పుడు టీడీపీ అభ్యర్థిని సైతం ఎన్నికల బరిలోకి దించడంతో పోటీ రసవత్తరంగా మారింది. మరోవైపు వైసీపీపై అసమ్మతి వ్యక్తం చేస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ ఓటు వేస్తారని నమ్మకం లేదు.. ఇటీవల ఈ అంశంపై వారు స్పందిస్తూ.. తాము ఆత్మ ప్రభోదానుసారం ఓటేస్తాం అని ప్రకటించడంతో వారి ఓట్లు వైసీపీకి పడడం కష్టమే.. వీరితో పాటు ఇంకా ఎవరైనా వైసీపీకి వ్యతిరేకంగా పార్టీలో ఉన్నారా అని వైసీపీ అధిష్టానం ఆరా తీస్తోంది.

ఎమ్మెల్యేకు విప్‌ జారీ చేసిన వైసీపీ, టీడీపీ..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందాలంటే సాధారణంగా 23 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. కానీ టీడీపీకి గెలిచిన వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. అయితే రూల్‌ ప్రకారం.. టీడీపీ ఓ బీసీ మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించారు. ఈనేపథ్యంలోనే తమ పార్టీలోని ఎమ్మెల్యేలకు అందరికీ విప్‌ జారీ చేశారు. ఒకవేళ అసమ్మతి ఎమ్మెల్యేలు టీడీపీ మద్దతు ఇస్తున్న వ్యక్తికి తప్ప వేరేవారికి ఓటు వేస్తే.. వారిని సస్పెండ్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇక టీడీపీ మాదిరిగానే.. వైసీపీలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉండటంతో ఆ పార్టీ విప్‌ ప్రసాద్ రాజు కూడా 151 ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేశారు. టీడీపీ ఒక్క సీటు కూడా గెలవకూడదని వైసీపీ భావిస్తోన్న తరుణంలో పార్టీలోని ప్రతి ఎమ్మెల్యేపై నిఘా ఉంచినట్టు సమాచారం. ఎన్నికల రోజు తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని.. 23వ తేదీ పార్టీ సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలని టీడీపీ, వైసీపీ వారి ఎమ్మెల్యేలకు సూచించాయి. విప్‌ను ధిక్కరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఇరు పార్టీలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఏపీలో కాకరేపుతున్నాయి.