దాడి చేసిన వారు ఇక చట్టసభల్లో అడుగుపెట్టరు – చంద్రబాబు
అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలు డోలా వీరాంజనేయ స్వామి, బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడులకు పాల్పడ్డారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులపై ఎవరైతే దాడి చేశారో.. వారు తిరిగి వచ్చే ఎన్నికల్లో గెలవకుండా చేస్తానని… తిరిగి చట్ట సభల్లో అడుగుపెట్టకుండా చేస్తానని హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘అసెంబ్లీ చరిత్రలో నేడు చీకటి రోజు’ అని అన్నారు. సీఎం జగన్ ప్రోద్భలంతో బాబాయ్ మర్డర్, కోడికత్తి డ్రామాలాగే.. పక్కా వ్యూహంతోనే ఇవాళ ఎమ్మెల్యే స్వామి, బుచ్చయ్యపై దాడి జరిగిందన్నారు. ఈ ఘటనతో ముఖ్యమంత్రి జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారన్నారు. చట్టసభలకు మచ్చ తెచ్చిన సీఎంగా నిలిచిపోతారని, స్వయంగా సభలో ఎమ్మెల్యేలపై దాడికి దిగడం ద్వారా వైసీపీ సిద్దాంతం ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యిందన్నారు. ఇది శాసన సభ కాదు…కౌరవ సభ అని చంద్రబాబు మండిపడ్డారు. అర్థంపర్థం లేని జీవో నంబరు 1ని జారీ చేసి.. దానిపై చర్చించమని టీడీపీ సభ్యులు కోరితే ఎందుకు చర్చ జరపరని చంద్రబాబు మండిపడ్డారు. జీవో 1ను రద్దు చేయమని అడగడం తప్పా అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ.. అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలను కొట్టలేదని చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చింది చిన్న గాలే.. రాబోయేది సునామీ అని చంద్రబాబు జోస్యం చెప్పారు.
మూడు రోజుల పాటు నిరసనలు..
మనుషులెవరూ శాశ్వతం కాదని, కానీ అసెంబ్లీ శాశ్వతమని చెప్పారు. విభజన సందర్భంలో మాట్లాడుకునే పరిస్థితి కూడా లేనప్పుడే ఎమ్మెల్యేలు విజ్ఞతతో వ్యవహరించారని, వైసీపీ వారు 150 మంది ఉన్నారని, 20 మంది ఉన్న తమ సభ్యులపై దాడి చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక ఈ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పర్యటనలు నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈక్రమంలోనే జీవో 1, సభలో ఘటనలను ప్రజలకు వివరించాలని చంద్రబాబు కోరారు. అవసరమైతే.. సభలో చోటుచేసుకున్న ఘటనలను ఢిల్లీకి కూడా తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది.