గుండె సమస్యలా? ఈ ఆసనాలు వద్దు!
భారత సంస్కృతిలో ప్రధానమైనవి యోగా, ధ్యానం. ఇవి మనసుతోపాటు శరీరాన్ని, అంతర్గత భావాల్ని నియంత్రించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా, మానసికంగానూ ఆరోగ్యం సమకూరుతుంది. యోగా సహాయంతో నయం చేయలేని వ్యాధి లేదనేది నిపుణుల మాట. ముఖ్యంగా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది యోగా. రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులను నియంత్రిస్తుంది. కానీ, అధిక రక్తపోటుతో ఇబ్బందిపడేవాళ్లు మాత్రం కొన్నిరకాల ఆసనాలు వేయకూడదని సూచిస్తున్నారు నిపుణులు. కొన్ని ఆసనాల వల్ల వారికి గుండెపోటు సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు.
గుండె సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు శీర్షాసనం, అధోముఖ వృక్షాసనం, సర్వాంగాసనాలలో గుండెపై ఒత్తిడి పడుతుంది. తద్వారా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. హైపర్‌టెన్షన్ ఉన్నవారికి.. రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడాల్సి ఉంటుంది. శీర్షాసనం, అధోముఖ వృక్షాసనం, సర్వాంగాసనం వేస్తే.. గుండెపై మరింత ఒత్తిడి పడుతుంది. శీర్షాసనం, అధోముఖ వృక్షాసనం, సర్వాంగాసనంలో ఒత్తిడి గుండె కింద భాగంలో ఉంటుంది. దీని కారణంగా శరీరం మొత్తానికి రక్తం సరఫరా చేయడానికి మరింత కష్టపడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా గుండెపోటు ముప్పు పెరుగుతుంది.
అధిక శ్రమ, ఊపిరి ఆడకపోవడానికి అవకాశం ఉన్న యోగాసనాలకు కూడా హైపర్‌టెన్షన్ పేషెంట్స్ వేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆసనాల కారణంగా.. హైపర్‌టెన్షన్ మరింత పెరుగుతుంది. అయితే హైబీపీ ఉన్న వ్యక్తులు యోగా చేయకూడదని కాదు. సరైన యోగాసనాలు ప్రాక్టిస్ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి ఒత్తిడి దూరం చేస్తుంది. శ్వాసతోపాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
గుండె సమస్యలు ఉన్నవారు తక్కువ శ్రమగల బాలాసనం, సుఖాసనం, శవాసనం, భుజంగాసనం, సేతు బంధ సర్వాంగాసనం వేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. హైపర్‌టెన్షన్ పేషెంట్స్ సోడియం ఉన్న ఆహారం తగ్గించి పొటాషియం ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. పొటాషియం పుష్కలంగా లభించే బొప్పాయి, అరటి, మామిడి, కమల,కాకర, స్ట్రాబెర్రీ, మునగ వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. రక్తపోటును తగ్గించడానికి వెల్లుల్లి బాగా సాయ పడుతుంది. వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి గుండె పనితీరు మెరుగుపడుతుంది..