బాల‌య్య మంచి మ‌న‌సు.. తారకరత్న కోసం ఏం చేశారంటే..

సినీనటుడిగానే కాకుండా.. రాజకీయ నాయకుడిగా.. ప్రజా సేవకుడిగా.. నట సింహం.. గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సేవా కార్యక్రమాలు సైతం ఆయన చేస్తుంటారు. ఇప్పటికే ఆయన తల్లి బసవతారకం పేరు మీద క్యాన్సర్‌ ఆసుపత్రికి ఏర్పాటు చేసి ఎందరో పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఈక్రమంలో మరోసారి బాలయ్య తన విశాల హృదయాన్ని ప్రజలకు తెలియజేశారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన నందమూరి తారకరత్న జ్ఞాపకార్థం ఎవరైతే పేదలైన చిన్నారులు గుండె జబ్బులతో బాధపడుతుంటారో వారందరికీ ఉచితంగా ఆపరేష్లను చేయించేందుకు బాలయ్య నిర్ణయం తీసుకున్నారు.

ఆపరేషన్‌ ఫ్రీ, మందులు, భోజనం మొత్తం ఉచితమే..
నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ సేవలను హిందూపూర్‌ నియోజకవర్గంలో బాలయ్య నిర్మించిన ఆసుపత్రిలోనే గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలను చేయనున్నారు. బాలయ్య తన బిడ్డగా భావించే.. తారకరత్నకు వచ్చిన కష్టం మరే కుటుంబానికి రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే కార్డియాక్‌, థీరోసిక్‌ సర్జరీ పేదలకు ఉచితంగా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హిందూపురంలో తాను నిర్మించిన హాస్పటల్ లోని హెచ్‌-బ్లాక్‌కు తారకరత్న పేరు పెట్టారు. దీంతోపాటు ఆ బ్లాక్‌లో గుండె చికిత్సలకు అవసరమయ్యే వైద్య సామగ్రిని కోటి 30 లక్షలతో బాలయ్య తెప్పిస్తున్నారు. దీని ద్వారా చిన్న పిల్లలకి వైద్యంతోపాటు, ఉచిత భోజనం, అవసరమైన మందులు కూడా మూడు నెలల పాటు ఫ్రీగా అందజేయనున్నారు.

తారకరత్నకు బాలయ్య అంటే ఎంతో ఇష్టం..
గత కొన్ని నెలల కిందట నారా లోకేష్‌ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసింది. ఆ వెంటనే అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. దాదాపు నెల రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు తుది శ్వాస విడిచారు. అయితే.. తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి బాలకృష్ణ వెంట ఉండి.. అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. వైద్యులతో నిత్యం మాట్లాడుతూ.. చికిత్స వివరాలు తెలుసుకుంటూ వచ్చారు. చివరికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ తారకరత్న చనిపోవడం మాత్రం అందరినీ కలిచివేసింది. ఇక బాలకృష్ణ గురించి ఇటీవల తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పెట్టిన పోస్టు ఆసక్తిని రేపింది. తారకరత్న ఆసుపత్రిలో ఉండగా.. అతని బెడ్‌ వద్ద బాలకృష్ణ కన్నీటి పర్యంతం అయ్యారని.. తన భర్త కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారని ఆమె చెప్పుకొచ్చారు. ఈనేపథ్యంలో బాలకృష్ణ మరోసారి తారకరత్న పేరుతో ఉచిత గుండె వైద్య చికిత్సలను ప్రారంభించి తన పెద్ద మనుసును చాటుకున్నారు.