Rafah Border: గాజా వాసుల జీవ‌న‌రేఖ‌.. ఏంటీ రాఫా స‌రిహ‌ద్దు?

ఇజ్రాయెల్ గాజా మ‌ధ్య (israel gaza war) భీక‌ర‌మైన యుద్ధం జ‌రుగుతున్న నేప‌థ్యంలో గాజా వాసులు అన్నీ వ‌దులుకుని త‌మ కుటుంబాల‌తో క‌లిసి వ‌ల‌స‌పోతున్నారు. వారికి ఇప్పుడు దిక్కు ఈజిప్ట్ (egypt) మాత్ర‌మే. గాజా నుంచి ఈజిప్ట్ వెళ్లాలంటే రాఫా బోర్డ‌ర్ (rafah border) దాటాల్సిందే. ఈ రాఫా బోర్డ‌రే ఇప్పుడు వీరికి జీవ‌న‌రేఖ‌. అస‌లు ఈ రాఫా బోర్డ‌ర్ ఏంటి? ఎందుక‌ని గాజా వాసుల కోసం ఇంత వ‌ర‌కు బోర్డ‌ర్ గేట్లు తెర‌వ‌లేదు?

ఎప్పుడైతే వెంట‌నే గాజా వ‌దిలి త్వ‌ర‌గా వెళ్లిపోండి అని ఇజ్రాయెల్ ప్ర‌భుత్వం అల్టిమేటం విధించిందో అప్ప‌టినుంచి రాఫా బోర్డ‌ర్ వ‌ద్ద గాజా వాసులు ఎప్పుడెప్పుడు గేట్లు తెరుస్తారా అని ప‌డిగాపులు కాస్తున్నారు. గాజాకు ఎగ్జిట్.. ఈజిప్ట్‌లోని సినాయ్ ద్వీప‌క‌ల్పానికి రాఫా బోర్డరే దారి. గాజాలోకి వెళ్ల‌డానికి బ‌య‌టికి రావ‌డానికి ఎరెజ్, కెరెం షాలోమ్ అనే మ‌రో రెండు స‌రిహ‌ద్దు కూడా ఉన్నాయి. అయితే వీటిని కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ వ‌స్తువుల త‌ర‌లింపున‌కు మాత్ర‌మే తెరుస్తారు. ఇప్పుడు ఈ రెండు కూడా మూత‌బ‌డ్డాయి. (rafah border)

స‌రిహ‌ద్దు సిబ్బంది భ‌ద్ర‌త‌కు ఏమాత్రం భంగం క‌లిగించ‌మ‌ని త‌మ‌కు హామీ ఇస్తేనే బోర్డ‌ర్ గేట్లు తెరుస్తామ‌ని రాఫా అధికారులు అంటున్నారు. బోర్డ‌ర్ గేట్లు వీలైంత త్వ‌ర‌గా తెరిచేందుకు అమెరికా, యూకే ప్ర‌భుత్వాలు ఈజిప్ట్, ఇజ్రాయెల్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ముందు ఈజిప్ట్ కేవ‌లం విదేశీ పాస్‌పోర్ట్ ఉన్న‌వారికి మాత్రమే బోర్డ‌ర్ గేట్లు తెరుస్తామ‌ని వెల్ల‌డించింది. కానీ వారితో పాటు పాలెస్తీనా వాసులు కూడా చొర‌బ‌డిపోతారేమోన‌ని.. దాని వ‌ల్ల రాజ‌కీయంగా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ఈజిప్ట్ భ‌య‌ప‌డుతోంది.

అదీకాకుండా ఈజిప్ట్‌లోని సినాయ్ ప్రాంతాన్ని తీవ్ర‌వాదులు చాలా కాలం పాటు ఏలారు. ఇప్పుడు రాఫా బోర్డ‌ర్ గేట్ల తెరిస్తే తీవ్ర‌వాదులు శ‌ర‌ణార్ధుల గెట‌ప్‌లు వేసుకుని ఎక్క‌డ చొర‌బ‌డ‌తారోన‌ని కూడా ఈజిప్ట్ భయ‌ప‌డుతోంది. యుద్ధం నేప‌థ్యంలో అనే కాదు.. సాధార‌ణ రోజుల్లో కూడా గాజా వాసులు రాఫా బోర్డ‌ర్ దాటి వెళ్లాలంటే రెండు మూడు వారాలకు ముందే పాలెస్తీనా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పాలెస్తీనా, ఈజిప్ట్ అధికారులు రిక్వెస్ట్ పెట్టిన ప్ర‌తీసారి అనుమ‌తిస్తారు అనే గ్యారెంటీ కూడా లేదు. ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌కారం 2023 ఆగ‌స్ట్‌లో ఈజిప్ట్ అధికారులు 19,608 మందిని రాఫా బోర్డ‌ర్‌లోకి అనుమ‌తించారు. 314 మందిని రిజెక్ట్ చేసారు. (rafah border)