స్పీకర్ ముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి రోజుకో గొడవ, గందరగోళ పరిస్థితుల నడుమ ఉద్రిక్తంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచి టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈనేపథ్యంలో వరుసగా టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్సెండ్ చేస్తూ వస్తున్నారు. అయితే.. ఇవాళ ఆ పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారి తీశాయి. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని రద్దు చేయాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది. ఈక్రమంలో జీవో నంబర్ 1ను రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. స్పీకర్ పట్టించుకోకపోవడంతో ఆయన పోడియాన్ని చుట్టుముట్టారు. సభలో బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు. ఈనేపథ్యంలో అక్కడ ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి.
దాడికి దిగిన ఎమ్మెల్యేలు..
స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ ఎమ్మెల్యే డోల వీరాంజనేయులు.. స్పీకర్ తమ్మినేనిపై జీవో నెం-1 పేపర్లను చించి ఆయనపై వేశారు. దీంతో స్పీకర్‌కు రక్షణగా పోడివం వద్దకు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. ఈనేపథ్యంలోనే టీడీపీ సభ్యులపైకి వైసీపీ ఎమ్మెల్యేలు సంజీవయ్య, తదితరులు దూసుకెళ్లారు. వెంటనే తమ సభ్యులు ముందుకు వెళ్లకుండా మంత్రి అంబటి రాంబాబు, శ్రీకాంత్ రెడ్డిలు అడ్డుకున్నారు. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య కొంతసేపు మాటల యుద్ధం నడిచింది.
స్పీకర్ దురుసుగా ప్రవర్తించారని టీడీపీ ఆరోపణ..
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖంపై టీడీపీ ఎమ్మెల్యే డోలా ప్లకార్డును పెట్టారు. వెంటనే స్పీకర్ ఆ ప్లకార్డును పక్కకు తోసేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన డోలా.. స్పీకర్‌తో దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఇక… స్పీకర్ తో టీడీపీ ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించటంతో రక్షణగా పోడియం దగ్గరకు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లారు. దీంతో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే స్పీకర్ తీరుపై టీడీపీ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సభలో వివాదాలు సృష్టించింది స్పీకరేనని వారు దుయ్యబట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రౌడిల్లా ప్రవర్తించారని ఆరోపించారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభా మర్యాదలు మరిచి టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ అంటే కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు.