Pravallika Suicide: కారణం ప్రేమా.. పరీక్షా..?!
చిక్కడపల్లిలోని హాస్టల్లో ఉంటూ గ్రూప్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ప్రవళిక (pravallika suicide) అనే అమ్మాయి ఆత్మహత్య ఘటన తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసింది. నిన్న రాత్రి ప్రవళిక హాస్టల్ గదిలో ఉరేసుకుంది. వెంటనే ఆ అమ్మాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించిన పోలీసులు ఆమె ఆత్మహత్యకు గల కారణాలను విచారించగా.. ప్రేమ వ్యవహారం అని తేల్చారు. ప్రవళిక రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లేఖలో ఏం రాసి ఉంది?
నేను నష్టజాతకురాలిని. నా వల్ల మీరెప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఏడవకుండా జాగ్రత్తగా ఉండండి అమ్మా. నేను మీకు పుట్టడం నా అదృష్టం. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. నేను మీకు అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవ్వరూ క్షమించరు. మీ కోసం నేను ఏమీ చేయలేకపోతున్నా. అమ్మా నాన్నా జాగ్రత్త అని రాసి ఉంది.
ఎవరీ ప్రవళిక?
ప్రవళికది వరంగల్ జిల్లా భిక్కాజపల్లి గ్రామం. చిక్కడపల్లిలోని అశోక్ నగర్లో ఓ హోస్టల్లో ఉంటోంది. గ్రూప్ 2 పరీక్షల కోసం సన్నద్ధమవుతోంది. (pravallika suicide)
పోలీసులు ఏమంటున్నారు?
ఈ కేసును విచారించిన చిక్కడపల్లి ACP యాదగిరి.. ప్రవళిక ఆత్మహత్యకు గల కారణం గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడటం కాదని.. ఆమె ప్రేమలో విఫలం అవ్వడం వల్లే అని తెలిపారు. ఎవరైనా ఆమె గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినా రాసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మమ్మల్ని ఎందుకు వెంబడించి కొట్టారు?
కాగా.. ప్రవళిక మృతిపట్ల సంతాపం తెలుపుతూ ఆమె గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడటం వల్లే చనిపోయిందని తోటి విద్యార్థులు అశోక్ నగర్‌లోని హాస్టల్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. దాంతో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేసారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి బాధిత విద్యార్థులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న ఓ బాధితుడు మాట్లాడుతూ.. జనాన్ని క్లియర్ చేయడానికి కొట్టారు అంటే ఓ అర్థం ఉంది కానీ.. ప్రవళిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్లిన తర్వాత కూడా పోలీసులు కక్షగట్టినట్లు ఎందుకు వెంబడించి కొట్టారు అని ప్రశ్నించారు.
ఇంకా స్పందించని KCR, KTR
ప్రవళిక మృతిపై తెలంగాణ సీఎం KCR, ఐటీ శాఖ మంత్రి KTR ఇంకా స్పందించకపోవడం గమనార్హం. కేటీఆర్.. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను కలిసి తమ పార్టీలో చేరాలని ఆహ్వానించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు కానీ ప్రవళిక గురించి ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోపక్క సీఎం KCR.. అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి ఆయన ఏ విషయం గురించి కూడా డైరెక్ట్‌గా స్పందించడంలేదని తెలుస్తోంది. (pravallika suicide)
కారణం ప్రేమా పరీక్షా?
ప్రవళిక సూసైడ్ చేసుకోవడానికి కారణం కొందరు ప్రేమ వ్యవహారం అంటుంటే మరి కొందరు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడటం అని అంటున్నారు. ఈ రెండింట్లో ఏది కరెక్ట్ అని ప్రవళిక తల్లిదండ్రులే వెల్లడించాలి. ఎందుకంటే ప్రవళిక సూసైడ్ లెటర్లో ఎక్కడా కూడా ప్రేమ విషయం గురించి వెల్లడించలేదు. అలాగని పరీక్షలు, చదువు గురించి రాయలేదు. ఒకవేళ ప్రేమ కారణంగా సూసైడ్ చేసుకుని ఉండి ఉంటే ఈ పాటికి ఆమె చావుకి కారణం అయిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఉండాలి. ఏదేమైనప్పటికీ.. ప్రవళికకు త్వరలో న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.