మెగాస్టార్ సినిమాలో చాన్స్ కొట్టేసిన అక్కినేని హీరో!

వాల్తేరు వీరయ్య ఘన విజయంతో మంచి స్పీడ్​ మీదున్నారు మెగాస్టార్​ చిరంజీవి. వరుస సినిమాలను లైన్లో పెట్టిన చిరు వేగంగా షూటింగులను పూర్తి చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య నిరాశ పరిచినా, గాడ్​ ఫాదర్​, వాల్తేరు వీరయ్య విజయంతో కమ్​బ్యాక్​ అయ్యారు చిరు. ఇక మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం భోళా శంకర్​. ఈ సినిమా గురించి ఓ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. హీరో సుశాంత్​ ఈ సినిమాలో భాగమవనున్నట్టు తెలుస్తోంది.

అక్కినేని కుటుంబం నుంచి టాలీవుడ్‌కు పరిచయమయ్యారు హీరో సుశాంత్. కెరీర్​ ప్రారంభం నుంచీ కథల ఎంపిక, యాక్టింగ్ పరంగా మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నప్పటికీ సుశాంత్‌ స్టార్ హీరోగా మాత్రం ఎదగలేకపోయారు. అయితే సుశాంత్​ నటించిన సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్‌ వద్ద బాగానే సందడి చేశాయి. సోలో హీరోగా సినిమాలు చేసిన సుశాంత్.. కొన్ని రోజులుగా స్టార్ హీరోల సినిమాల్లో ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అర్జున్​, త్రివిక్రమ్​ కాంబినేషన్​ వచ్చిన సూపర్​ హిట్​ మూవీ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో మొదటిసారి సహాయపాత్రలో కనిపించారు సుశాంత్​. ఇక ఈ సినిమా ఘన విజయం సాధించడంతో మాస్ ఆడియన్స్​కు దగ్గరయ్యారు. మాస్‌ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న రావణాసుర సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఏప్రిల్ 7వ తేదీన పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ కాబోతున్న రావణాసుర సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో సుశాంత్ మేకోవర్ లుక్‌కు పలువురి ప్రశంసలు కూడా దక్కాయి. రవితేజ – సుశాంత్ మధ్య చిత్రీకరించిన యాక్షన్ సీన్లు మాస్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక, తాజాగా సుశాంత్‌కు భారీ ఆఫర్ వచ్చిందని టాక్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహెర్‌‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్. ఈ సినిమాలోని కీలకపాత్ర కోసం సుశాంత్‌ను చిత్ర యూనిట్ సంప్రదించినట్టు తెలుస్తోంది. దానికి సుశాంత్ కూడా ఓకే చెప్పారని సమాచారం. భోళా శంకర్ సినిమాలో చిరుకు చెల్లెలుగా నటిస్తున్న కీర్తి సురేష్‌కు ప్రియుడిగా సుశాంత్ గెస్ట్‌ రోల్ చేయనున్నట్టు తెలుస్తోంది.

తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న భోళా శంకర్‌‌ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిజానికి తమిళ సినిమాలో సుశాంత్ క్యారెక్టర్ నిడివి తక్కువే. అయితే తెలుగులో సుశాంత్ క్యారెక్టర్‌‌ నిడివి కాస్త పెంచారని, ఒక పాటలో కూడా సుశాంత్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. మార్చి 18వ తేదీన సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా భోళా శంకర్‌‌ సినిమాలో ఆయన నటిస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్‌ మెంట్‌తోపాటు, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్​. ఏది ఏమైనా సోలో హీరోగా సినిమాలు చేసినప్పుడు రాని క్రేజ్‌ను స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ తెచ్చుకుంటున్నారు సుశాంత్​. ఇక, అక్కినేని మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో సుమంత్​ కూడా ఈ మధ్య వరుస సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీతారామం, సార్​ వంటి సినిమాల్లో సుమంత్​ నటనకి ప్రశంసలు దక్కాయి.