విజయశాంతి స్వీట్ వార్నింగ్.. రానా నాయుడు గురించేనా?
విక్టరీ వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ బోల్డ్ వెబ్ సిరీస్ గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరోతో అడల్ట్ కంటెంట్ పెట్టి వెబ్ సిరీస్ తీయడమే. సిరీస్ మొత్తంలో విపరీతమైన బోల్డ్ కంటెంట్ ఉండటంతో ఫ్యాన్స్ కూడా చూడటానికి ఇంట్రెస్ట్ చూపడంలేదు. ఈ నేపథ్యంలో సినీ నటి, బీజేపీ నేత విజయశాంతి ఈ వెబ్‌సిరీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఆమె రానా నాయుడు పేరు తీయకుండా పరోక్షంగా ఓటీటీలో బోల్డ్ కంటెంట్‌తో రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి స్పందించారు.
“ఓటీటీలో రిలీజ్ అయ్యే కంటెంట్‌పై కూడా సెన్సార్షిప్ ఉండాలి. ఓటీటీలో ప్రసారమయ్యే అసభ్యకరమైన దృశ్యాలను తొలిగించి, మహిళా వ్యాతిరేకతతో కూడిన ఉద్యమాల వరకు తెచ్చుకోకుండా ఉంటారని భావిస్తున్నా” అని తెలిపారు. అయితే ఆమె రానా నాయుడు పేరు చెప్పకపోయినా ఇటీవల రిలీజ్ అయిన ఓ తెలుగు వెబ్‌సిరీస్ అని సంబోధించారు. దాంతో ఆమె రానా నాయుడు గురించే వ్యాఖ్యానించారని, మొత్తానికి ఒక్కరైనా ఇలాంటి వాటి గురించి పట్టించుకుంటున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానా నాయుడు వెబ్సిరీస్లోని బోల్డ్ కంటెంట్ గురించి ఇప్పటికే రానా.. అభిమానులకు ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.