దంచి కొడుతున్న వాన.. హైదరాబాద్‌లో భీభత్సం!
హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలతోపాటు.. పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. బోయిన్పల్లి, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, బేగంపేట, ప్యాట్నీ, అల్వాల్, తిరుమలగిరి, కూకట్పల్లి, హైదర్‌నగర్, జీడిమెట్ల, ఆల్విన్ కాలనీ, బాచుపల్లి, నిజాంపేట, కాప్రా, ఈసీఐఎల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్‌సిటీ, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్, పంజాగుట్టతో పాటు తదితర ప్రాంతాల్లో కొద్దిచోట్ల వానపడింది. పలుచోట్ల వడగళ్లు వాన సైతం కురిసింది. భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో వడగళ్లవాన కురిసింది.
సంగారెడ్డి పటాన్‌చెరువులో, ఉమ్మడి కరీంనగర్ జిల్లవ్యాప్తంగా పలుచోట్ల వడగళ్లు కురిశాయి. కరీంనగర్, రామగుడు, గంగాధర మండలాల్లో వర్షం కురిసింది. చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి, భీమారం వడగళ్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద, జుక్కల్, పెద్దకోడపగల్, మద్నూర్ మండలం తడ్గూర్లో వడగళ్ల కురిసింది. మరో రెండు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని తెలిపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
అకాల వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలెర్టు..
ఐఎండి ప్రకారం తమిళనాడు నుంచి మధ్యప్రదేశ్ వరకు రాయలసీమ, తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో శనివారం రాత్రి పలు ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు… మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండవద్దని సూచించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.