Canada: భార‌త్‌తో ప్రైవేట్‌గా చ‌ర్చించాలి..మంత్రి రిక్వెస్ట్

ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ (hardeep singh nijjar) హ‌త్య కేసులో భార‌త్ హ‌స్తం ఉంద‌ని కెన‌డా (canada) ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో (justin trudeau) ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్ర‌స్తుతానికి ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు ప‌చ్చిగా ఉన్నాయి. అయితే.. భార‌త్‌లో ఉన్న కెన‌డా దౌత్యాధికారుల్లో 40 మందిని వెన‌క్కి పిలిపించాల‌ని అది కూడా వారంలో జ‌రిగిపోవాల‌ని భార‌త్ కెన‌డాకు అల్టిమేటం విధించింది.

ఈ నేప‌థ్యంలో కెన‌డా విదేశాంగ శాఖ మంత్రి మెల‌నీ జోలీ స్పందిస్తూ.. కెన‌డా భార‌త్‌తో ర‌హ‌స్యంగా చ‌ర్చించాల‌నుకుంటోంద‌ని.. ఇరు దేశాల మ‌ధ్య విష‌యాలు గోప్యంగా ఉంటేనే మంచిద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త్ ఒప్పుకుంటే వెంట‌నే చ‌ర్చ‌లు జరిపి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపారు. ప్రస్తుతానికి భార‌త్‌లో కెన‌డాకు చెందిన దౌత్యవేత్త‌ల సంఖ్య 61గా ఉంది. అంత మంది భార‌త్‌లో ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని.. వారిలో 40 మందిని వెన‌క్కి తీసుకోవాల‌ని భార‌త్ ఆదేశాలు జారీ చేసింది. మ‌రోప‌క్క కెన‌డా ప్ర‌ధాని ట్రూడో భార‌త్‌తో గొడ‌వ‌లు పెంచుకోవాల‌ని అనుకోవ‌డం లేద‌ని ఇప్ప‌టికీ బాధ్య‌త‌తోనే వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని తెలిపారు.

ఆరోప‌ణ‌లు సీరియ‌స్.. విచార‌ణ జ‌ర‌గాల్సిందే

మరోప‌క్క భార‌త్‌పై కెన‌డా చేసిన ఆరోప‌ణ‌లు చాలా సీరియ‌స్ అని విచార‌ణ జ‌ర‌గాల్సిందేన‌ని అగ్రరాజ్యం అమెరికా అంటోంది. విచార‌ణ‌కు అన్ని విధాలుగా స‌హ‌క‌రించాల‌ని భార‌త్‌కు కూడా చెప్పామ‌ని ఇక ఈ రెండు దేశాలు కూర్చుని చ‌ర్చించుకుంటే అంద‌రికీ మంచిద‌ని వైట్ హౌస్ తెలిపింది.