నిమిషం లేటైతే 5 లక్షల ఫైన్.. హన్సిక పెళ్లిలో వరుడికి షాక్!
దేశముదురు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హన్సికా మోత్వాని వరస సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. తెలుగుతోపాటు తమిళ సినిమాల్లో రాణించి దక్షిణాదిన బిజీ హీరోయిన్గా మారిన హన్సిక గత ఏడాది డిసెంబర్లో సోహెల్ కథూరియాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హన్సికా, సోహెల్ సోషల్ మీడియా ద్వారా తమ బంధాన్ని పెళ్లితో సంపూర్ణం చేయనున్నట్టు ప్రకటించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లిలో ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా వరుడు, అతని కుటుంబం నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని షరతు పెట్టారట హన్సిక తల్లి మోనా మోత్వానీ.
హన్సిక మోత్వాని సోహెల్ కతురియాని డిసెంబర్ 2022లో పెళ్లి చేసుకున్నారు. హన్సిక పెళ్లి సందడి ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే మూడు ఎపిసోడ్లు రిలీజవగా అందులో హల్దీ, మెహందీ ప్లానింగ్, మూడో ఎపిసోడ్‌లో హన్సిక, సోహైల్ డ్రెస్సింగ్ సెలక్షన్‌ను, మంగళసూత్రం ఎంపికను చూపించారు. ఇరు కుటుంబాలు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని పెళ్లి వేడుకలను షురూ చేశారు. పూజ అనంతరం హన్సిక జంట డ్యాన్సులతో హడావుడి చేసింది.
మరోవైపు కన్యాదాయం చేయనని తల్లి చెప్పడంతో భావోద్వేగానికి లోనైంది హీరోయిన్. ఒకరికి దానమివ్వడానికి నువ్వేం ఒక వస్తువు కాదని, కన్యాదానానికి బదులుగా గోదానం చేస్తానంది. 30 సంవత్సరాలు గుండెలకు హత్తుకుని పెంచుకున్న కూతురిని ఎవరికైనా దానమిచ్చేయాలంటే ఎలా మనసొప్పుతుంది, నువ్వు ఎప్పటికీ పరాయిదానివి కాదు అంటూ ఎమోషనలైంది ఆమె తల్లి. ఆ మాటలు విని హన్సిక కన్నీటిపర్యంతమైంది. నీకింత మంచి ఆలోచన వచ్చినందుకు గర్వంగా ఉంది. నువ్వు కన్యాదానం చేసినా చేయకపోయినా ఈ కన్య నీతోనే ఉంటుంది అంటూ ఏడ్చేసింది హన్సికా.
ఇక, తాజాగా రిలీజైన కోయి మిల్ గయా ఎపిసోడ్‌లో హన్సికా తల్లి మోనా మోత్వాని వివాహ వేడుకలకు ఆలస్యంగా వచ్చినందుకు వరుడి కుటుంబాన్ని గట్టిగా మందలించినట్టు తెలుస్తోంది. ఆలస్యంగా వచ్చిన ప్రతి నిమిషానికి రూ. 5 లక్షలు చెల్లించాలని సోహెల్, అతని కుటుంబ సభ్యులను ఆమె డిమాండ్ చేసినట్టు ఈ ఎపిసోడ్‌లో స్పష్టంగా తెలుస్తోంది.
పెళ్లి వేడుకలకు ఆలస్యంగా రావడంపై మోనా వరుడి తల్లికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. ‘నేను మీకు ఒక అభ్యర్థన చేయాలనుకుంటున్నాను. కతురియాలు చాలా ఆలస్యంగా వచ్చే వ్యక్తులు, మోత్వానిలు సమయపాలన పాటించేవారు. మీరు ఈరోజు ఆలస్యంగా వస్తే, ఒక్క నిమిషం ఆలస్యమైనా నాకు రూ. 5 లక్షలు చెల్లించాలి. నా ఈ అభ్యర్థన ఎందుకంటే సాయంత్రం 4:30 నుండి 6 గంటల మధ్య రాహుకాలం ఉంది కాబట్టి మీరు కొంచెం తొందరగా రాగలరా అని అభ్యర్థిస్తున్నాను’ అని అభ్యర్థిస్తూనే వరుడి కుటుంబాన్ని డిమాండ్ చేశారు మోనా మోత్వానీ.