కుక్క దాడిలో బాలిక మృతి… వరుస ఘటనలతో ఆందోళన!

తెలంగాణ రాష్ట్రంలో కుక్కల దాడిలో చిన్నారులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి ఏవిధంగా చంపాయో అందరూ సామాజిక మాధ్యమాల్లో చూసి బాధపడ్డారు. ఈ ఘటన మరువక ముందే.. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లిలో నెల రోజుల కిందట 13 సంవత్సరాల బాలికను ఓ కుక్క కరిచింది. బాలిక తల్లిదండ్రులు ఆ వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం వారు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈక్రమంలో అక్కడ చికిత్స పొందుతూ అమ్మాయి చనిపోయింది. దీంతో చేతికొచ్చిన కుమార్తె కుక్కల దాడిలో చనిపోయింది అంటూ.. తల్లిదండ్రులు గుండెలవిసేలా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం కూడా కొంత ఉంది..
వీధి కుక్కలను కట్టడి చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అవి రెచ్చిపోతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనపై అక్కడి మేయర్‌ స్పందించిన తీరు కూడా అలాగే ఉంది. కుక్కలకు అన్నం పెట్టేవారు లేక.. అవి మనుషులపై దాడి చేస్తున్నాయని మేయర్‌ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని పెద్ద దుమారాన్ని లేపాయి. అయితే.. చిన్నారులే లక్ష్యంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు.