Mahatma Gandhi అస్తికలు ఎందుకు పంచిపెట్టారు?
జాతిపిత మహాత్మా గాంధీ (mahatma gandhi) జయంతి ఈరోజు. ఏటా అక్టోబర్ 2న మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయని గాంధీని స్మరించుకుంటూ ఆయన మార్గంలో నడుస్తూ ముందుకు వెళ్తున్నాం. గాంధీ జయంతి సందర్భంగా మీకు ఓ ఆసక్తికరమైన కథనాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాం. గాంధీ చనిపోయినప్పుడు ఆయన అస్తికలను దేశవ్యాప్తంగానే కాదు.. వివిధ దేశాలకు కూడా పంచిపెట్టారట. ఈ వివరాలేంటో తెలుసుకుందాం.
గాంధీ జన్మించింది అక్టోబర్ 2వ తేదీన అని అందరికీ తెలిసిందే. చిన్న పిల్లల్ని అడిగినా ఠక్కున చెప్తారు. కానీ జాతిపిత కన్నుమూసిన తేదీ మాత్రం ఎవ్వరికీ గుర్తుండదు. మనకోసం, దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మనిషి మరణాన్ని ఎవ్వరూ గుర్తుపెట్టుకోవాలని అనుకోరుగా..! గాంధీ 1948 జనవరి 30న నథూరాం గాడ్సే చేతిలో చనిపోయారు. అయితే ఆయన చనిపోయాక దహన సంస్కారాలను దేశ రాజధాని ఢిల్లీలోని నదీ ఒడ్డున నిర్వహించారు.
కోట్లాది మంది ప్రజలు తమ నివాళులు అర్పించేందుకు తరలి వచ్చారు. ఆ తర్వాత గాంధీ అస్తికలను ఆయన కుటుంబీకులు మాత్రమే గంగలో కలపాలని అనుకోలేదు. యావత్ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా ఆయనకు కుటుంబీకులే అని భావించి అస్తికలను కొద్ది కొద్దిగా భారత్‌దేశంలోని వివిధ రాష్ట్రాలకే కాకుండా మలేషియా, ఈస్ట్ పాకిస్థాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్), బర్మా, శ్రీలంక ప్రజలకు కూడా పంపించారు. (mahatma gandhi)
గాంధీ అస్తికలను ఇంటికి తెచ్చుకుని స్వయంగా నివాళులు అర్పించాలని ఎన్నో కుటుంబాలు ముందుకొచ్చాయి. అయితే కొందరి ఇళ్లల్లో మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. అయినా కూడా వారు కుటుంబాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డారు కానీ గాంధీ అస్తికలను స్వయంగా నదిలో కలిపి నివాళులు అర్పించాలని నడుం బిగించారు. ఒక కంటైనర్‌లో గాంధీ అస్తికలను అలహాబాద్‌కు తరలించారు. ఆ అస్తికలను చూసేందుకు వేలాది మంది తరలి వచ్చారు. వాటిని గంగ, యమున, సరస్వతి సంగమంలో కలిపేసారు. గాంధీ అస్తికలను ఆయన కుమారుడు నదిలో కలుపుతుంటే కొందరు వ్యక్తులు కన్నీరుమున్నీరవుతూ.. ఆయన్ను మర్చిపోలేక అస్తికలు కలిపిన నీటిని కూడా తాగేసారు.
గాంధీ స్నేహితుడు ఒకరు కొద్దిగా అస్తికలను తీసుకుని వాటిని ఓ ఉంగరంలో పేర్చి పెట్టుకున్నారు. 1994లో గాంధీ అస్తికలను కట్టక్‌లోని ఓ బ్యాంక్ లాకర్‌లో భద్రంగా దాచినట్లు తెలిసింది. 2006లో దుబాయ్‌లో, 2010లో మరో దేశంలో గాంధీ అస్తికల్లోని కొంత భాగం భద్రంగా దాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అంతా కలిసి ఆ అస్తికలను సముద్రాలు, నదుల్లో వదిలి నివాళులు అర్పించారు. కొన్ని ప్రదేశాల్లో ఎక్కడైతే గాంధీ అస్తికలను వదిలారో అక్కడ ఆయన గుర్తుగా స్మారక చిహ్నాలు నిర్మించారు. (mahatma gandhi)
గాంధీజీ ముని మనవళ్లలో ఒకరైన తుషార్ గాంధీ.. తన ముత్తాత అస్తికలను ఇంకా భద్రపరిచి పెట్టుకోవడం సరికాదని వాటికి దక్కాల్సిన విలువ దక్కాలని అన్నారు. వెంటనే వాటిని నదుల్లో కలిపేయాలని రిక్వెస్ట్ చేసారు. కానీ ఎవరైతే ఇంకా అస్తికలను భద్రంగా దాచుకున్నారో వారు తుషార్ మాటలను పట్టించుకోలేదు.