TSPSC బోర్డు రద్దుపై ఉత్కంఠ…కేసీఆర్‌ నిర్ణయమే ఫైనల్‌!

టీఎస్‎పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష పత్రాలు లీకైన అంశంపై అటు ప్రతిపక్షపార్టీలు, ప్రజలు, నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శులు వస్తుండటంతో అసలు ఆ బోర్డును ఎత్తివేసే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. అందుకే ఇవాళ ప్రగతి భవన్‌కు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి రావాలని ఆయనకు పిలుపు అందింది. ఈ భేటీలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావ్‌తోపాటు సీఎం కేసీఆర్‌ కూడా పాల్గొంటున్నట్లు తెలియవస్తోంది. ఇప్పటికే పేపర్ లీకేజ్‌పై అంశంపై కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

అధికారుల నిర్లక్ష్యమే కారణమా..
సాధారణంగా టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ వంటి ప్రభుత్వ అనుబంధ సంస్థలు లేదా కార్యాలయాల్లో పెద్దఎత్తున భద్రత, నిఘా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరు ఏడు ప్రశ్నాపత్రాలు లీకవుతున్నా.. కనీసం అక్కడి అధికారులు దృష్టికి ఈ విషయం చేరకపోవడం పెద్దప్రశ్నగా మారింది. నిజంగా అధికారుల నిర్లక్ష్యం ఉందా.. లేక చాలామందికి పరీక్ష పత్రాలు లీకవుతున్న విషయం ముందుగానే తెలుసా అన్నదానిపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల వ్యాప్తి అధికమైన తరుణంలో ఎక్కడ ఏది జరిగిన అందరికీ తెలిసిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బోర్డు అధికారులు, సిబ్బంది ఇలాంటి వ్యవహారాలు నడపడంపై చర్చనడుస్తోంది.

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షతోపాటు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించగా.. ఇప్పటికే అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్షలను రద్దు చేసింది. మొత్తం మీద ఆరు పరీక్షలను రద్దు చేయగా.. గ్రూప్‌-1 ప్రిలిమిన్స్‌ పరీక్షను జూన్‌ 11న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈక్రమంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌తో భేటీ అవుతున్న నేపథ్యంలో దీని తదనంతరం ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి.. అన్నదానిపై ముఖ్యంగా నిరుద్యోగుల్లో మాత్రం కొంత గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు.